ఈ మధ్యకాలంలో దర్శకనిర్మాతలు పౌరాణిక చిత్రాలపై పడ్డారు. ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పౌరాణికి గాథలను మరింత గొప్పగా తెరకెక్కించవచ్చని మేకర్స్ భావిస్తున్నారు. ‘మహాభారతం’ సినిమాను మళ్లీ తీయాలనేది రాజమౌళి ప్రయత్నం. ఈలోగా ఆయన గురువు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘రామాయణం’ తీయాలని నిర్ణయించుకున్నారు. ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా తరువాత రాఘవేంద్రరావు మరో సినిమా చేయలేదు. ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టుకోవాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి.
‘రామయం’ గాథని చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నారు. భారీ హంగులతో, స్టార్ నటీనటులతో ఈ కథను చూపించాలని భావిస్తున్నారు. రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు రామాయణ కథ ఆధారంగా చాలా సినిమాలొచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ చేస్తోన్న ‘ఆదిపురుష్’ సినిమా కూడా రామాయణ గాథే. కానీ రాఘవేంద్రరావు కొత్త పద్దతిలో రామాయణాన్ని ఆవిష్కరిస్తారట. ఇప్పుడున్న క్రేజీ సినిమాలన్నీ కూడా రెండు పార్ట్ లుగా వస్తున్నాయి. మరి రాఘవేంద్రరావు కూడా అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి!