ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ “ఈ మాయ పేరేమిటో” సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. రాము కొప్పుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు విడుదలై మంచి స్పందన అందుకుంది. ఈ సినిమాలో రాహుల్ విజయ్ అన్ని విధాలుగా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. స్టంట్స్‌కు ప్రాధాన్యం ఉండే యాక్షన్ సినిమాలు చేసే వీలున్నప్పటికీ క్యూట్ ప్రేమకథను ఎంచుకొని రాహుల్ విజయ్ మంచి పనిచేశారని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా “నేను సినిమాల్లో పుట్టిపెరిగా. మా నాన్న విజయ్ మాస్టర్.
చేసే పనిలో సంతృప్తి కలిగినప్పుడు ఆయన చాలా సుఖంగా నిద్రపోయేవారు. అసంతృప్తి అనిపించినప్పుడు సరిగా నిద్రపట్టేది కాదు. ఓ టెక్నీషియన్ తనయుడిగా నేను కోరుకుంటున్నది ఒకటే… నాతో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ సంతృప్తిగా నిద్రపోవాలి. నేను తప్ప, మరెవరూ భర్తీ చేయలేని పాత్రల్లో నటించాలని అనుకుంటున్నా” అని రాహుల్ విజయ్ అన్నారు. అలా చెప్పినట్టే కష్టపడి నటించారని, డ్యాన్సులు అదరగొట్టారని సినిమా చూసినవారు అభినందిస్తున్నారు. స్టార్ డైరక్టర్ సుకుమార్ కి మెచ్చిన ఈ సినిమా ఇప్పుడు ప్రతి ఒక్కరికీ నచ్చడం చిత్ర బృందానికి ఆనందం కలిగిస్తోంది.