‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సరికొత్త మేకోవర్ తో కనిపిస్తున్న సిద్ధార్థ్, ఈ చిత్రంతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘కయ్యాలే’, ‘పెదవులు వీడి మౌనం’, ‘ఊపిరే’ పాటలు విశేష ఆదరణ పొందాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి ‘రెయిన్ బో’ అనే పాట విడుదలైంది.
‘టక్కర్’ నుంచి ‘రెయిన్ బో’ అనే నాలుగో పాటను ఈరోజు(జూన్ 2) సాయంత్రం 4 గంటలకు విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించగా, కృష్ణకాంత్ అన్ని పాటలకు సాహిత్యం అందించారు. ‘కయ్యాలే’ ఫుల్ వీడియో సాంగ్ ని విడుదల చేసి సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన మేకర్స్.. ‘రెయిన్ బో’ సాంగ్ కూడా ఫుల్ వీడియో విడుదల చేసి ఆ ట్రెండ్ ని కొనసాగించారు. నాయకానాయికలు కారులో వెళ్తూ, దారిలో కలిసిన వారితో సరదాగా గడుపుతున్నట్లుగా పాట చిత్రీకరణ సాగింది. నివాస్ కె ప్రసన్న మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. సంగీతానికి తగ్గట్లుగా సిద్ధార్థ్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. “రెయిన్ బో చివరే ఒక వర్ణం చేరెలే” అంటూ కృష్ణకాంత్ పాటను ఎత్తుకోవడమే కొత్తగా ఎత్తుకున్నారు. ఆయన సాహిత్యం ఎప్పటిలాగే కట్టిపడేసేలా ఉంది. సంగీతానికి, సాహిత్యానికి తగ్గట్లుగా బెన్నీ దయాల్, వృష బాబు ఎంతో ఉత్సాహంగా పాటను ఆలపించారు. మొత్తానికి ‘టక్కర్’ నుంచి విడుదలవుతున్న ప్రతి పాట ఎంతగానో ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.
ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఎడిటర్ గా జీఏ గౌతమ్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె వ్యవహరిస్తున్నారు.