‘బాహుబలి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. కెప్టెన్ కుర్చీకే వన్నె తెచ్చిన ఈ దర్శకుడు ఇండియా క్రికెట్ టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ని ప్రశంసలతో ముంచెత్తాడు. సినిమా కోసం గడ్డం పెంచి ‘యోగి’ రూపంలో కనిపించిన రాజమౌళి ధోనిని “కర్మయోగి”గా అభివర్ణించాడు. నిన్న జరిగిన ఎం.ఎస్.ధోని – ది అన్‌టోల్డ్ స్టోరి’ సినిమా ఆడియో విడుదలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి ఆడియో సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “1985 క్రికెట్ చూస్తున్నాం. అయితే అప్పట్లో ఆట గెలుస్తామా.. ఓడిపోతామా అన్న భయంతోనే చూసే వాళ్ళం. ధోని వచ్చాక ఆ భయం స్థానంలో సంతోషం చేరిందని” కొనియాడిన రాజమౌళి “130 కోట్లమంది ప్రపంచ కప్ కోసం పరితపిస్తుంటే, ఆ కప్ సాధించాక ఎలాంటి ఆడంబరం లేకుండా కప్ తోటి ఆటగాళ్లకు ఇచ్చి తాను పక్కన నిలబడిపోయారని” గుర్తుచేస్తూ, భగవద్గీత లోని “కర్మణ్యే వాధికారస్తే..” శ్లోకాన్ని తలచి ఆ సారం ప్రకారం ఈ కూల్ కెప్టెన్ ను కర్మయోగిగా పేర్కొన్నారు.
తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ “ధోనిని స్ఫూర్తిగా భావించే లక్షల మంది భారతీయుల్లో నేనొకరిని. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా వేడుకకి రావడం గర్వంగా ఉందంటూ తొలి ఆట చూసేందుకు వేచి చూస్తున్నా” అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, భూమిక చావ్లా, కైరా అడ్వానీ, దిశా పఠానీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ సినిమాకి అమాల్ మాలిక్, రోచక్ కోహ్లి, సంజయ్ చౌదరి సంగీతం అందించారు. ఫాక్స్‌స్టార్ స్టూడియోతో కలిసి అరుణ్ పాండే నిర్మించారు.