2015లో విడుదలై ఘన విజయం సొంతం చేసుకోవడమే కాక ఆస్కార్ కి కూడా నామినేట్ అయ్యి సంచలనం సృష్టించిన “రంగితరంగ” చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అనూప్ బండారీ తన రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం “రాజరాధం”. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొంది నేడు విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ కు ఏమేరకు నచ్చిందో చూద్దాం..!!
కథ : అభి (నిరూప్ బండారీ), మేఘ (అవంతిక శెట్టి) ఇద్దరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అభికి ఫస్ట్ ఇయర్ నుంచి మేఘ మీద క్రష్ ఉన్నప్పటికీ.. సీనియర్ మధ్యలో ఉన్నాడనే భయంతో ప్రపోజ్ చేయడు. అయితే.. ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేసుకొన్న ఇద్దరూ అనుకోకుండా ఒకే బస్ లో బెంగుళూరు వరకూ ప్రయాణించాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో ఇద్దరూ దగ్గరయ్యారా, బెంగుళూరు చేరుకొనేసరికి వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకొన్నాయి అనేది “రాజరాధం” కథాంశం.
నటీనటుల పనితీరు : నిరూప్ బండారీ, అవంతిక శెట్టిలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. వాళ్ళిద్దరి కంటే అతిధి పాత్ర పోషించిన ఆర్య ఇంటెన్స్ రోల్ లో అద్భుతంగా నటించాడు. బస్ లో పాసింజర్స్ గా నటించిన నటులందరూ కన్నడ వారే కావడంతో వారి పాత్రలకు ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు. మరో ముఖ్యపాత్ర పోషించిన రవిశంకర్ టిపికల్ గా ట్రై యాక్ట్ చేయాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది.
సాంకేతికవర్గం పనితీరు : అనూప్ బండారి సంగీతం, విలియం డేవిడ్ సినిమాటోగ్రఫీ క్వాలిటీ పరంగా బాగున్నప్పటికీ.. కథ-కథనం ప్రేక్షకుడి సహనాన్ని వీరలెవల్లో పరీక్షించడంతో వాటిని ప్రేక్షకుడు సరిగా ఎంజాయ్ చేయలేడు.
దర్శకుడు అనూప్ బండారి చాలా సాధారణ కథలో కొన్ని అవసరమైన, ఇంకొన్ని అనవసరమైన బ్యాగ్రౌండ్ స్టోరీస్ ను యాడ్ చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడే తప్ప కథకి కానీ కథాగమనానికి కానీ ఏమాత్రం ఉపయోగపడలేదు. ముఖ్యంగా రాణా చెప్పిన వాయిస్ ఓవర్ తో కథను నడిపించే ప్రయత్నంలో ప్రతి పాత్రను ఇంట్రడ్యూస్ చేయడానికే ఫస్టాఫ్ మొత్తం అయిపోవడం, ఇన్నర్ స్టోరీస్ ఎక్కువ రన్ అవ్వడంతో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వడమే కాక సినిమా రన్ టైమ్ ఎక్కువవ్వడంతో థియేటర్ లో కూర్చోలేక ప్రేక్షకుడు పడే ఇబ్బందిని ఏమని వర్ణించగలం. ఇక్కడ దర్శకుడు కథకుడిగా తన ప్రతిభను, విజ్ణానాన్ని చాటుకోవడం కోసం చేసిన విపత్కర ప్రయత్నం ప్రేక్షకుడి పాలిట మరణ శాసనంలా మారింది.
విశ్లేషణ : అసలు ఈ సినిమాని కన్నడతోపాటు తెలుగులో ఎందుకు తీశారో, రిలీజ్ చేశారో అర్ధం కాక, సినిమాలో దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడో తెలియక, అన్నిటినీ మించి సినిమాని ఎండ్ చేసిన విధానం బుర్రకెక్కక మదనపడేలా చేసిన సినిమా “రాజరాధం”.
రేటింగ్ : 1/5