సీనియర్ హీరో, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇండస్ట్రీ అంతా నటకిరీటీ అని పిలుచుకునే రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad).. మాట తీరు కొంచెం చాదస్తంతో నిండి ఉంటుంది. ఇలా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. స్టేజి ఎక్కి మైకు పట్టుకున్నాడు అంటే.. ఆ చాదస్తం అందరికీ కనిపిస్తుంది. ‘ఇక్కడ మీరు చప్పట్లు కొట్టాలి’ అంటూ బలవంతంగా ఆడిటోరియంలో ఉన్న జనాలతో అతను చప్పట్లు కొట్టించుకునే టైపు. సరే ఆ విషయాలు పక్కన పెట్టేద్దాం..
ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో ‘ఇప్పుడు హీరో డెఫినిషన్ మారిపోయింది. ‘గంధపు చక్కల దొంగ.. వాడు హీరో” అంటూ చమత్కారంగా మాట్లాడారు రాజేంద్రప్రసాద్. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) పాత్రని ఉద్దేశించి ఆయన ఆ కామెంట్స్ చేశారు అనేది ఎవ్వరికైనా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మరో సినిమా ఈవెంట్లో ఆ విషయంపై ప్రశ్నించగా.. ఇప్పుడు మాట మార్చేశాడు.
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “మొన్న అల్లు అర్జున్, నేను కూర్చున్నాం. అప్పుడు ఇదే విషయం గురించి నన్ను అడిగాడు. ‘అంకుల్.. మీరు ఆ మాట అనలేదు అని నాకు తెలుసు’ అని అతను అంటే… ‘పిచ్చోడా…! నేనే అన్నాను’ అని చెప్పాను. అప్పుడు మళ్ళీ అతను ‘అయినప్పటికీ మీరు అన్నది ఆ ఉద్దేశ్యంతో అయ్యి ఉండదు’ అని అన్నాడు.’కరెక్ట్… నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదు’ అని చెప్పాను.
‘సోషల్ మీడియా ఎలా తయారయ్యింది అంటే.. మనం ఒకటి చెబుతాం. వాళ్ళు ఇంకోటి రాస్తారు. అయినప్పటికీ నాకు తెలిసిన ఒక వ్యక్తిని గట్టిగా పట్టుకుని అడిగాను. ‘నేను అన్నది ఎందుకు రాశావ్ రా?’ అని..! అందుకు అతను.. ‘అన్నయ్య.. అలా హెడ్డింగ్ పెట్టకపోతే.. ఎవ్వరూ చదవట్లేదు అన్నాడు. అది సంగతి” అంటూ చెప్పుకొచ్చాడు.