రాకేశ్ మాస్టర్ ఇటీవల కాలంలో వైరల్ అవ్వడానికి కారణం.. ఆయన కొంతమందితో చేసిన ఇంటర్వ్యూలు, ఆయన కొంతమంది ఇచ్చిన ఇంటర్వ్యూలే అనే విషయం తెలిసిందే. వివిధ అంశాలపై మొదలుపెట్టే ఇంటర్వ్యూ ఆ తర్వాత అలా అలా ఆయన గతంలోకి వెళ్లేది. దీంతో ఆయన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఆయన గుర్తుకు తెచ్చుకుని కొంతమందిపై దుర్భాషలాడేవారు. ఎందుకు అలా అనేవారు అనేది తెలియదు కానీ.. ఈ క్రమంలో ఆయన తన శిష్యుడు శేఖర్ మాస్టర్ మీద కోపం ప్రదర్శించేవారు.
అయితే, గతంలో రాకేశ్ మాస్టర్ తన శిష్యుల మీద అమితమైన ప్రేమను చూపించేవారు. గతంలో దీని గురించి కొన్ని విషయాలు కూడా పంచుకున్నారు. ‘‘నీ మాస్టర్‌ని నమ్మితే నీ జీవితం మాడిపోయిన దోసె అవుతుంది’’ అని రాకేశ్ మాస్టర్ దగ్గర శేఖర్ మాస్టర్ శిష్యుడిగా ఉన్నప్పుడు ఎవరో అన్నారట. అంత మాట చెప్పినా శేఖర్ తనను వదిలి వెళ్లలేదు అని రాకేశ్ మాస్టర్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
నా దగ్గర ఉంటే విషమైనా, తీపి అయినా కలసి పంచుకుందాం అని రాకేశ్ మాస్టర్ తన వారికి, తన శిష్యులకు చెప్పేవారట. అలా చెప్పిన మాటలకు కట్టుబడి శేఖర్, సత్యం ఆయన దగ్గరే ఉన్నారట. ఈ మాటల్ని ఓసారి రాకేశ్ మాస్టర్ ‘ఢీ’ షోకి గెస్ట్‌గా వచ్చినప్పుడు చెప్పారు. అప్పుడు శేఖర్ మాస్టర్ కూడా తన గురువు పేరును పచ్చబొట్టును పెట్టుకున్న సంగతి గుర్తు చేసుకుని.. తన కెరీర్‌లో ఆయన ఎంత ముఖ్యం అనే విషయాన్ని వివరించారు.
వేణు హీరోగా వచ్చిన ‘చిరునవ్వుతో’ సినిమాలోని ‘నిన్నలా మొన్నలా లేదురా…’ పాటకు రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఆ సినిమాకి పనిచేసే తొలి అవకాశం ఇచ్చిన వేణు గురించి రాకేశ్ మాస్టర్ ఓ సారి చెప్పుకొచ్చారు. తొలి అవకాశం ఇచ్చినప్పుడు ఎంతో ఆనందించానని, అవి మరిచిపోలేని క్షణాలని రాకేశ్ మాస్టర్ అన్నారు. అలా ఆయన ఆ తర్వాత సుమారు 1500 పాటలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు.