షారుక్ ని ఇరకాటంలో పడేసిన హృతిక్ తండ్రి

తమ తమ సినిమాల విడుదల విషయంలో షారుక్, హృతిక్ ల మధ్య ఇటీవల చిచ్చు రాజుకున్న విషయం విదితమే. ఇప్పుడీ వ్యవాహారంలోకి హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ వచ్చి చేరారు. ఈయన మాటలు వినడానికి బాగానే ఉన్నా అంతరార్థం మరోలా ఉందంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.హృతిక్ – రాకేశ్ రోషన్ కలయికలో రానున్న క్రిష్ 3 సినిమాని 2018 క్రిస్మస్ కి విడుదల చేస్తామంటూ కొద్దిరోజుల క్రితం ప్రకటించిన రాకేష్ రోషన్ ఇప్పుడు తన మాటను వెనక్కి తీసుకున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ తో చేస్తున్న సినిమా కోసం షారుక్ ముందుగా ఆ తేదీని ప్రకటించారు గనక తాము రేసు నుండి తప్పుకుంటున్నట్టు వెల్లడించిన రాకేశ్ జి 2017 జనవరి 26న విడుదల కానున్న ‘కాబిల్’ ను మాత్రం వాయిదా వేసే ఉద్దేశ్యం లేదన్నారు.

షారుక్ తన ‘రాయిస్’ సినిమాని వాయిదా వేసేది, లేనిది అతడి విజ్ఞతకే వదిలేస్తున్నట్టు అన్నారు.ఇక్కడే మరోకోణం బయటపడిందంటున్నారు బాలీవుడ్ బాబులు. రాకేష్ రోషన్ ఇప్పుడిలా అన్నా షారుఖ్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రాకేశ్ బంతి విసురుతారని అభిప్రాయపడుతున్నారు. రాకేశ్ రోషన్ అన్న మాటలు వీటిని ధృడ పరిచేలానే ఉన్నాయి. షారుఖ్ తన తమ్ముడి వంటి వాడన్న రాకేష్ రోషన్ తన దర్శకత్వంలో మూడు హిట్ సినిమాలను అందించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో పరోక్షంగా గురుభక్తిని చాటుకోమన్నట్టు సూచన ఇచ్చారని బాలీవుడ్ గుసగుసలు. అలా ఇప్పటికే సుల్తాన్ కోసం ఓసారి ‘రాయిస్’ సినిమాని వాయిదా వేసిన షారుఖ్ ని ఇరకాటంలోకి నెట్టేశారు హృతిక్ జనకుడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus