ఈ సంవత్సరం ఆరంభంలో ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ లో శ్రీదేవిగా మెరిసింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే చాలా మందికి అసలు ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ నటించిందా అనేంత సందేహం కలుగక మానదు. అనులోనూ ఆమె అభిమానులు చాలా నిరుత్సాహానికి గురయ్యారనే చెప్పాలి. అయితే ప్రస్తుతం కార్తీ హీరోగా వస్తున్న ‘దేవ్’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఖాకీ’ చిత్రం కూడా తెలుగులో మంచి విజయాన్ని నమోదు చేయడంతో ఈ చిత్రం పై కూడా మంచి అంచనాలున్నాయి. అంతే కాదు ఈ ఏడాది ఐదు సినిమాలతో కనువిందు చేస్తానంటుంది ఈ భామ.
‘దేవ్’ చిత్రం ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజు కానుకగా విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. “2018లో నాకు ఏ సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు .. నాకు ఇక సినిమాలు లేవని.. చాలా వార్తలు వచ్చాయి. ఇలాంటి వార్తలు నేను కూడా చాలా చదివాను. నిజానికి నేను తెలుగులో ఎక్కువ సినిమాలు చెయ్యలేదు. కానీ మూడు తమిళ్ సినిమాలు మరియు రెండు హిందీ సినిమాలు చేస్తున్నాను. వాటి షూటింగ్ లో చాలా బిజీ బిజీగా ఉన్నాను. ఆ ఐదు సినిమాలు ఈ ఏడాదిలోనే వరుసగా రిలీజ్ అవుతాయి. ఇక ‘దేవ్’ చిత్రం కూడా కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. నాకు ఈ సినిమా చాలా ప్రత్యేకం. నేను చాలా ఆధునిక ఆలోచనలు కలిగిన అమ్మాయి పాత్రను పోషిస్తున్నాను, చాలా మొండి పట్టుదలగల అమ్మాయినన్న మాట. నాకు ఈ పాత్ర చాలా కఠినమైన పాత్ర అనే చెప్పాలి. కానీ నా పరిధిలో నేను ఈ పాత్రలో ఉత్తమంగా చెయ్యటానికి నా వంతు ప్రయత్నం చేశాను. ఇక తెలుగులో నటిస్తున్న ‘వెంకీ మామ’ చిత్రం నెక్స్ట్ వీక్ నుండీ మొదలుకాబోతుంది.” అంటూ రకుల్ ప్రీత్ తెలిపింది.