తెలుగు సినిమాలపై మనవారి కంటే ఇతరులకే నమ్మకం ఎక్కువగా ఉన్నట్టుంది. అందుకే ఇక్కడ స్టార్ హీరోల సినిమాలు మొదలవ్వగానే బేరాలు మొదలు పెట్టేస్తున్నారు. ఇది వరకు సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన తరవాత ఇండస్ట్రీ వర్గాల టాక్ బట్టి హిందీ డబ్బింగ్ హక్కులకోసం వచ్చేవారు. ఇప్పుడు కాంబినేషన్, ఆ స్టార్ క్రేజ్ ని బట్టి అలా క్లాప్ కొట్టగానే.. ఇలా రైట్స్ కొనేస్తున్నారు. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు 22 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలిసింది. ఈ మూవీ రీసెంట్ గా మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. అందులో చరణ్ పాల్గొనలేదు. రంగస్థలం సినిమా పనుల్లో బిజీగా ఉండడం వల్ల.. హీరోలేని సన్నివేశాలను బోయపాటి ముందుగా కంప్లీట్ చేశారు.
రెండో షెడ్యూల్ నుంచి రామ్ చరణ్ పాల్గొననున్నారు. అయితే ఈ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ తో సినిమా డబ్బింగ్ హక్కులు ముందుగానే అమ్ముడుపోయాయి. ఇది తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ రికార్డు. హీరోపై ఒక సీన్ కూడా కంప్లీట్ కాకముందే బిజినెస్ మొదలెట్టిన చిత్రంగా ఇది రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్ కి నలుగురు అన్నలు ఉంటారు. వీరందరూ ఇదివరకు హీరో పాత్రలు పోషించిన వారే కావడం విశేషం. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.