ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల గురించి ప్రభుత్వం నుండి వాదన ఒకలా ఉంటే, ఇండస్ట్రీలో కొంతమంది నుండి వాదన ఇంకోలా ఉంది. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయంలో స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసి… సుదీర్ఘమైన వివరణ ఇచ్చి, కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. టికెట్ రేట్ల విషయంలో రాష్ట్రప్రభుత్వం లాజిక్ ఏంటో చెప్పాలని కూడా ఆయన కోరారు. తనతో పాటు పరిశ్రమకు కూడా ఈ విషయం చెప్పాలని అడిగారాయన.
నేనెప్పుడూ ప్రభుత్వ పాలసీలు, రాజకీయాలను పట్టించుకోను. నాకు అవగాహన కూడా లేదు. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా, కామన్‌మ్యాన్‌గా నా అభిప్రాయం చెబుతున్నా. ఈ విషయంలో నేనెవరినీ తప్పు బట్టడంలేదు. మ్యాన్యుఫ్యాక్చరర్ తయారు చేసిన వస్తువుకు… కొన్ని ఫ్యాక్టర్స్‌ను బట్టి ధర నిర్ణయిస్తాడు. అది వినియోగదారుడికి నచ్చితే కొనుక్కుంటాడు. లేకపోతే మానేస్తాడు. ఆ వస్తువు అమ్మితే సంబంధిత ట్యాక్స్ ప్రభుత్వానికి చేరుతుంది అని చెప్పారు వర్మ. హోటల్ చిన్నదైనా, ఫైవ్‌స్టార్ రేంజ్ అయినా అందులో వడ్డించే ఆహారం ఒకటే.
ఎవరి స్తోమతను బట్టి వారు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుంటారు. సినిమా థియేటర్ల విషయంలోనూ అంతే. టాలీవుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం ‘బాహుబలి’. హాలీవుడ్‌ని తలదన్నే ప్రతిభ తెలుగువారికీ ఉందని ఈ సినిమాతో రాజమౌళి నిరూపించారు. ‘బాహుబలి’కి మించి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఉండొచ్చు. దీనికి మించి మరొకటి రావొచ్చు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు, ఇతర సినిమాలకు ఒకే టికెట్ ధర అని చెప్పడంలో అర్థం లేదు అని అన్నారు వర్మ. సినిమా బడ్జెట్‌లో సుమారు 70 శాతం (రెమ్యూనరేషన్) హీరోలకే వెళ్లిపోతుందని, 30 శాతమే మేకింగ్ కాస్ట్ అని పేర్ని నాని గారు, అనిల్‌కుమార్ యాదవ్ అంటున్న మాటల్లో… నిజంలేదు.
ఎందుకంటే రెమ్యూనరేషన్, మేకింగ్ కాస్ట్ అంటూ వేర్వేరుగా ఉండవు. అంతా ఒకటే. ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చేది హీరోలను చూడటానికి. హీరోలు అంత మొత్తం తీసుకుని ప్రేక్షకులపై భారం మోపుతున్నారని వాదించటం కరెక్ట్ కాదు అని అన్నారు ఆర్జీవీ. బ్రాండెడ్ చొక్కా ₹50 వేలల్లో, సాధారణ చొక్కా ₹ 50కే దొరకొచ్చు. అలాంటప్పుడు షర్ట్ అని బోర్డు పెట్టి రెండింటికీ ఒకే రేటు చెబితే కుదరదు కదా. అసలు సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక ఏదైనా లాజిక్ ఉందా? ఒకవేళ ఉంటే అది చిత్ర పరిశ్రమకూ వివరించాలి.