ప్రతి శుక్రవారం రెండు మూడు సినిమాలు విడుదలవడం సర్వ సాధారణమే. కానీ, మే 27న హిందీలో విడుదల కానున్న రెండు సినిమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమాల మధ్య పోటీగా కాకుండా, ఇద్దరు దర్శకుల మధ్య సమరంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇద్దరూ మరెవరో కాదు.. గురుశిష్యులు రామ్ గోపాల్ వర్మ, అనురాగ్ కశ్యప్. వర్మ దర్శకత్వం వహించిన ‘కిల్లింగ్ వీరప్పన్’, అనురాగ్ కశ్యప్ ‘రమణ్ రాఘవ్’లు మే 27న ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ వేసవిలో వీరిద్దరి సమరంతో హిందీ బాక్సాఫీస్ వేడెక్కనుంది. సాధారణంగా అయితే ఈ వార్తకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వవలసిన అవసరం లేదు. ఇక్కడ విశేషం ఏంటంటే.. దర్శకులు ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు. హిందీలో వర్మ చివరి చిత్రం ‘సత్య 2’, అనురాగ్ కశ్యప్ ‘బాంబే వెల్వెట్’ దారుణ పరాజయాన్ని చవిచూశాయి. ప్రస్తుతం ఇద్దరు మధ్య సఖ్యత లేదు.
యదార్థ ఘటనలకు వెండితెర రూపం ఇవ్వడంలో మంచి సిద్దహస్తులుగా ముద్రపడ్డ ఇద్దరూ అటువంటి చిత్రాలతోనే వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇద్దరి చిత్రాల మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. ఎర్ర చందనం స్మగ్లర్ వీరప్పన్ జీవితకథ ఆధారంగా ‘కిల్లింగ్ వీరప్పన్’ తెరకెక్కుతోంది. తెలుగులో తీసిన సినిమానే హిందీలో రీమేక్ చేస్తున్నారు. 1966లో 23 మందిని హత్య చేసిన సైకో కిల్లర్ ‘రమణ్ రాఘవ్’ జీవితకథతో అనురాగ్ కశ్యప్ సినిమా తీశారు. రెండు సినిమాల్లోనూ హంతకులే హీరోలు. దీనికి తోడు మే 27న ఇద్దరు హంతకుల్లో ఎవరు ఎవర్ని హత్య చేస్తారో.. అంటూ వర్మ ట్వీట్ చేయడం గమనార్హం.