‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule) ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల నుండి అద్భుతమైన స్పందన అందుకుంటోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటన, రష్మిక మందన్న (Rashmika Mandanna) పెర్ఫార్మెన్స్ ప్రశంసలు అందుకుంటున్నాయి. ముఖ్యంగా ‘పుష్ప 2’ మొదటి రోజు అనూహ్యమైన కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హిందీ మార్కెట్‌లో సైతం ఈ చిత్రం భారీ రికార్డులు నెలకొల్పినట్లు సమాచారం. ఈ చిత్రంలో రష్మిక పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ‘పీలింగ్స్’ సాంగ్ లో ఆమె చేసిన డాన్స్ అందరిని ఆకట్టుకుంది.
‘పుష్ప 2’తో రష్మిక తనకు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్‌ను మరోసారి నిరూపించుకుంది. తొలి షోనే సెలబ్రిటీల నుంచి మంచి స్పందన రావడం విశేషం. ఇందులో భాగంగా రష్మిక, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని AMB మాల్లో ఈ చిత్రాన్ని వీక్షించింది. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో విజయ్ తల్లిదండ్రులు, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో (Anand Deverakonda) రష్మిక కనిపించడంపై నెట్టింట కొత్త చర్చ మొదలైంది. గతంలోనే విజయ్, రష్మికల మధ్య ఉన్న సాన్నిహిత్యం పై రూమర్స్ వచ్చాయి.
ఇద్దరూ ఈ విషయంపై స్పందించకపోయినా, పరోక్షంగా వారి సాన్నిహిత్యాన్ని అంగీకరించినట్లు వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప 2’ స్పెషల్ షోలో వారి ఫ్యామిలీ కలయికకు సంబంధించిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే కాకుండా, రష్మిక (Rashmika) తరచూ హైదరాబాద్ వచ్చినప్పుడు విజయ్ కుటుంబంతో ఎక్కువగా సమయం గడుపుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, పుష్ప 2 విడుదల రోజు విజయ్ కుటుంబంతో ఆమె కలిసి సినిమా చూడటంతో, వారి రిలేషన్ పై అభిమానుల్లో చర్చ మరింత ముదిరింది. మరోవైపు, రష్మిక తన వ్యక్తిగత జీవితం గురించి ఇంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరి పేరు చెప్పకపోయినా, “ఇటు నేను, అటు నా జీవిత భాగస్వామి కూడా సంతోషంగా ఉన్నాం” అని చెప్పిన మాటలు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.