Rashmika: అవే నాకు ప్రేరణగా నిలిచాయి: రష్మిక మందన్నా

  • July 30, 2023 / 09:10 PM IST

ప్రతీ పాపులర్‌ పుస్తకం ఒక సెలబ్రిటీనే! అలాంటి పుస్తకాలు తారల చేతుల్లో కనిపిస్తే.. మరింత కుతూహలం ఏర్పడుతుంది. ఆ మధ్య రష్మిక మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కొన్ని మంచి పుస్తకాలను పోస్టు చేసింది.. ‘ఇవన్నీ చదివి ప్రేరణ పొందాను.. మీరు కూడా చదవండ’ని సిఫారసు చేసింది.. ‘నాకు నచ్చాయ్‌.. మరి మీకూ’ అంటున్న రష్మిక ఫేవరెట్‌ బుక్స్‌ గురించి తెలుసుకుందా..

‘వెన్‌ బ్రీత్‌ బికమ్స్‌ ఎయిర్‌’

‘ఇక, నువ్వు ఎన్నో రోజులు బతకలేవు..’’ ఎంత గుండెధైర్యమున్న వాడికైనా మరణం తెలిసినప్పుడు ఊపిరి ఆగిపోతుంది. ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఆంగ్లసాహిత్యం, స్టాన్‌ఫోర్డ్‌, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో వైద్యశాస్త్రం చదివి.. పదేళ్లు న్యూరోసర్జన్‌గా శిక్షణ పూర్తి చేసుకుని.. ఎందరో ప్రాణాలను కాపాడిన వైద్యుడే ఇలాంటి చావుకబురు వినాల్సిరావడం ఎంత ఘోరం? 36 ఏళ్ల పవుల్‌ కళానిధికి ఆ పరిస్థితే ఎదురైంది. అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరలాజికల్‌ సర్జరీ వంటి అత్యున్నత పరిశోధనా అవార్డు తీసుకున్న ఆయన తన మరణాన్ని తను కనిపెట్టలేకపోయాడు.

‘నీకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌.. క్షమించండి ఎక్కువ రోజులు బతకలేరు’ అంటూ తోటి వైద్యుడు చెప్పాక.. భార్య, పిల్లలు కళ్లలో మెదిలారు. మనసును దిటవు చేసుకోక తప్పలేదు. మరణాన్ని మౌనంగా అంగీకరించి.. ఆ కాసిన్ని రోజులైనా అర్థవంతంగా జీవిద్దామనుకున్నాక మళ్లీ పుట్టినట్లయింది. అయితే ఏడాదికే కన్నుమూశాడాయన. డాక్టర్‌ అనుభవించిన మరణపు ముందురోజులకు అక్షరరూపమే ఈ పుస్తకం. బతుక్కు చావుకు మధ్య కొట్టుమిట్టాడే జీవన్మృతులకు ప్రాణవాయువు.. పవుల్‌ కళానిధి జీవితం.

‘ద స్పై’

‘మాతాహరి’ ఎంత పాపులర్‌ అంటే నెదర్లాండ్‌ వెళితే ఇప్పటికీ ఆమె విగ్రహం మనల్ని ఆకర్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు వీరాభిమానులు ఉన్నారు. సమ్మోహితరూపం, కనికట్టుచేసే కళ్లు.. ఎంతటివారైనా దాసోహం అవ్వాల్సిందే!. మాతాహరి డచ్‌కు చెందిన డ్యాన్సర్‌. కోటీశ్వరులకు మాత్రమే దక్కే ఖరీదైన వేశ్య. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీకి ఆమె గూఢచారిణిగా పనిచేసిందన్న నెపంతో మరణశిక్ష పడింది. ఫ్రాన్స్‌ సైన్యం ఆ అందాలతారను దయాదాక్షిణ్యాలు లేకుండా కాల్చిచంపింది.

ఇప్పటికీ ఆమె గూఢచారిణి కాదని, నిర్దోషి అని వాదించే వర్గం ఒకటుంది. మాతాహరి జీవితంలో ఉత్కంఠనురేపే సన్నివేశాలు లెక్కలేనన్ని. ఈ సజీవకథను తీసుకుని ‘ద స్పై’ పేరుతో నవలగా రాశాడు ప్రముఖ రచయిత పాల్‌ కొయిలో. ఇప్పటికే ఆయన ‘పరుసవేది’ (అల్‌కెమిస్ట్‌) మన తెలుగు పాఠకులకు సుపరిచితమే!. ఆయన రాసిన ప్రతి పుస్తకమూ ప్రాచుర్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా 89 భాషల్లో 20 కోట్ల పాల్‌ పుస్తకాలు అమ్ముడవ్వడం విశేషం.

ద లిటిల్‌ బిగ్‌ థింగ్స్‌’

కాలికి చిన్నముల్లు గుచ్చుకుంటే విలవిల్లాడతాం.. ఒంట్లో నలతగా ఉంటే ఇక ఏదో అయిపోయిందని కుంగిపోతాం.. అలాంటిది భుజాల కిందిభాగం మొత్తం పక్షవాతానికి గురై.. అచేతనులైతే? ఇక జీవితమే లేదనుకుంటాం. కానీ, హెన్నీప్రాసెర్‌ ‘ప్రతి రోజును పండగలా జరుపుకొన్నాడు’. పదిహేడేళ్లప్పుడు జరిగిన ప్రమాదంలో దేహంలోని సగభాగం చచ్చుబడిపోయింది..

అయినా డీలా పడలేదు. మిగిలిన సగభాగం ఆరోగ్యంగా ఉందికదా అనే ఆశతోనే బతికాడు. ఆయన అనుభవాలు మరికొందరికి ప్రేరణ కావాలని రాసిందే ‘ద లిటిల్‌ బిగ్‌ థింగ్స్‌’.

‘ద చేంజ్‌..’

‘టైమ్‌ లేదు..’ అంటూ ఎందుకు పదమై పాడుతుంటాం? ప్రతిదీ ఎందుకింత సంక్లిష్టం? ప్రపంచాన్ని పాలిస్తున్నది ఎవరు? ప్రజాస్వామ్యం మన ఆశల్ని తీరుస్తుందా? ఎవర్ని ఎంత వరకు నమ్మాలి?.. వీటికి కచ్చితమైన సమాధానాలు దొరికినప్పుడే మార్పు మొదలవుతుంది. ఏ జబ్బుకు ఆ మందు అన్నట్లు వైద్యుడిచ్చిన గుళికల్లా ఏ సమస్యకు ఆ మోడల్‌ పరిష్కారాన్ని అందించారు ‘ద చేంజ్‌’ పుస్తక రచయితలు మైకేల్‌ క్రోజెమ్స్‌, రోమన్‌.

ఇదొక పాపులర్‌ పుస్తకం. ఇందులో కష్టమైన సమస్యలకు 52 నమూనాల్లో సులువైన పరిష్కారాలను వివరించారు. ఆయా రంగాలపై జరిగిన అధ్యయనాలు, అనుభవజ్ఞులు, నిపుణుల అభిప్రాయాలతో రూపొందిన ఈ పుస్తకంలోని ప్రతీ పేజీ విలువైనదే! అందుకే ఇది అద్భుతం.. అనుసరణీయం.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus