Rathnam Review in Telugu: రత్నం సినిమా రివ్యూ & రేటింగ్!
April 26, 2024 / 02:43 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
విశాల్, (Hero)
ప్రియ భవాని శంకర్, (Heroine)
సముద్రఖని, మురళీశర్మ, యోగిబాబు తదితరులు.. (Cast)
హరి (Director)
కార్తికేయన్ సంతానం - అలంకార్ పాండియన్ (Producer)
దేవిశ్రీప్రసాద్ (Music)
ఎం.సుకుమార్ (Cinematography)
Release Date : ఏప్రిల్ 26, 2024
“భరణి, పూజ” లాంటి కమర్షియల్ హిట్స్ అనంతరం హరి (Hari) -విశాల్ (Vishal) కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం “రత్నం” (Rathnam). మోషన్ పోస్టర్ విడుదల నుండే సినిమా చర్చకు దారి తీసింది. గత రెండు వారాలుగా పేరున్న తెలుగు సినిమాల విడుదల లేకపోవడంతో.. తెలుగు ప్రేక్షకులు కూడా హరి & విశాల్ మాస్ సినిమాను ఎంజాయ్ చేద్దామనుకున్నారు. మరి “రత్నం” ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: రత్నం (విశాల్) చిన్నప్పుడే తల్లిని కోల్పోయి.. పెంచిన వ్యక్తి (సముద్రఖని)ని (Samuthirakani) మావయ్యగా అభిమానిస్తూ.. ఆ ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడతాడు. ఒకానొక సందర్భంలో రోడ్డుపై మల్లిక (ప్రియ భవానీ శంకర్)ను (Priya Bhavani Shankar) చూసి ఆమె ఎవరో తెలుసుకొనే ప్రయత్నంలో.. ఆమెను కొందరు రౌడీల బారి నుండి కాపాడతాడు. అయితే.. అంతటితో అయిపోలేదని, ఆమెను చంపడానికి లింగం బ్రదర్స్ (మురళీ శర్మ & కో) (Murali Sharma) నక్కల్లా వేచి చూస్తున్నారని తెలుసుకొని ఆమె కోసం వాళ్ళ ఊరు వెళ్ళి నిలబడతాడు.
అసలు మల్లికకు సహాయం చేయాలని రత్నం ఎందుకు అంత కసిగా ఫిక్స్ అయ్యాడు? అతడి మనసులో ఉన్న కారణం ఏమిటి? లింగం బ్రదర్స్ ను ఎలా ఎదిరించాడు? వంటి ప్రశ్నలకు హరి మార్క్ స్క్రీన్ ప్లేతో చెప్పిన సమాధానమే “రత్నం” చిత్రం.
నటీనటుల పనితీరు: విశాల్ మొదలుకొని ప్రియభవాని శంకర్, మురళీశర్మ, సముద్రఖని తదితరులందరూ నటులుగా తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా.. ప్రియభవాని శంకర్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమోషనల్ సీన్స్ లో ఆమె స్క్రీన్ ప్రెజన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది.
సాంకేతికవర్గం పనితీరు: ముందుగా ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేషన్ ఇచ్చిన సి.బి.ఎఫ్.సి బోర్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఒక మనిషి శరీరంలో ఉన్న అన్నీ భాగాలను అత్యంత క్రూరంగా కోసి, నరికి, కత్తిరించే సన్నివేశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమాకి “యు/ఏ” ఇవ్వడం అనేది సెన్సార్ బోర్డ్ ఎంత అద్భుతంగా పని చేస్తుంది అనేందుకు నిదర్శనం. ఇక దర్శకుడు హరి తను నమ్ముకున్న ఫార్మాట్ లోనే సినిమా కథను రాసుకున్నాడు.
ఎదురులేని హీరో, ఎదిరించడానికి రెడీగా ఉన్న విలన్, హీరోని కాపాడే ఒక పెద్దన్న, హీరో మర్యాదగా ఆరాధించడానికి ఒక హీరోయిన్. ఈ సక్సెస్ ఫుల్ ఫార్మాట్ కి హరి మార్క్ స్క్రీన్ ప్లే మిస్ అయ్యింది “రత్నం” విషయంలో. అందువల్ల ఈ చిత్రం కనీస స్థాయిలో కూడా అలరించలేకపోయింది. దర్శకుడిగా తనను తాను కొత్తతరం దర్శకులతో పోటీపడేలా అప్డేట్ చేసుకుంటానని, యువ దర్శకులైన అట్లీ లాంటి వాళ్ళను చూసి ఇన్స్పైర్ అవుతానని చెప్పుకొచ్చిన హరి, సినిమా విషయంలో ఎక్కడా అది పాటించకపోవడం గమనార్హం.
ముఖ్యంగా తెలుగు వెర్షన్ డైలాగులు & సాహిత్యం సినిమాను మరింత దిగజార్చాయి. ఇక ప్రాసల కోసం పడిన తాపత్రయం సీరియస్ డైలాగ్స్ & సీన్స్ ను కూడా కామెడీ చేసేశాయి. సినిమాటోగ్రఫీ వర్క్ లో ఎక్కడా రెగ్యులర్ హరి మార్క్ కనిపించలేదు. అలాగే.. దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం కూడా సరిగా వర్కవుటవ్వలేదు. ముఖ్యంగా నేపధ్య సంగీతం విషయంలో దేవి నిరాశపరిచాడు. ప్రొడక్షన్ డిజైన్, సౌండ్ ఇంజనీరింగ్ గట్రా విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
విశ్లేషణ: హరి సినిమా కదా కనీసం మంచి యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి అని ఊహించి థియేటర్ కి వెళ్తే మాత్రం ఈ ఎండాకాలంలో వడదెబ్బ కంటే హరి దెబ్బ తగిలినట్లే. విశాల్-హరి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూడో చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.
ఫోకస్ పాయింట్: ఇది మెరవలేని రత్నం!
రేటింగ్: 1.5/5
Rating
1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus