సినీ పరిశ్రమలో పెద్దలు తరచుగా చెప్పే మాట ఒకటుంది. అదేంటంటే.. ఇండస్ట్రీలో ఎదిగిపోవాలంటే ‘‘ గుమ్మడికాయంత టాలెంట్‌తో పాటు ఆవగింజంత అదృష్టం’’ కూడా వుండాలి అని. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ప్రతిభావంతులకు కొదవ లేదు. ఇప్పుడు సూపర్‌స్టార్లుగా వెలుగొందుతున్న వారి కంటే కూడా అపారమైన మేధాశక్తితో పాటు టాలెంట్ వుండి కూడా అట్టడుగున నిలిచిపోయిన వారు ఎందరో. ఇందుకు చేతిలో అదృష్ట రేఖ లేకపోవడం కారణమని విజ్ఞుల మాట. భారతీయ చిత్ర పరిశ్రమలో కూడా ఇలాంటి దురదృష్టవంతులు చాలా మందే వున్నారు.
ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం అవి సూపర్‌హిట్లు కావడం మన తెలుగు నాట ఎంతోమంది కథానాయకులకు జరిగింది. కథ నచ్చకో, డేట్లు కుదరకో ఒక హీరో ఆ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేయడం .. మరో హీరో దానిని అందిపుచ్చుకుని బ్లాక్ బస్టర్ కొట్టిన ఘటనలు మనం చూశాం. ఇక అసలు మేటర్‌లోకి వెళితే.. నటుడిగానే కాకుండా వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రవిబాబు. తీసిన ప్రతి సినిమాలోనూ కొత్తదనం వుండేలా తెరకెక్కించడం ఈయన స్పెషాలిటీ. ఈ మధ్య సరైన హిట్ లేకపోయినప్పటికీ ఆయన సినిమాలకి మంచి క్రేజ్ ఉంది.
ఈ క్రమంలో ఇటీవల ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. 2005లో రుణ్, ఆర్తి అగర్వాల్‌తో తెరకెక్కించిన సోగ్గాడు అనే సినిమా గురించిన సంగతులు చెప్పుకొచ్చాడు రవిబాబు. ఈ సినిమాని మల్టీస్టారర్‌గా తెరకెక్కించాలని ఆయన భావించాడట. తరుణ్‌తో పాటుగా మరో హీరోగా అప్పుడు మంచి స్వింగ్‌లో వున్న ఉదయ్ కిరణ్‌ని సెలక్ట్ చేసుకున్నాడట రవిబాబు. అయితే తొలుత ఈ సినిమా చేస్తానని చెప్పిన ఉదయ్ కిరణ్.. సడన్‌గా తప్పుకోవడంతో తాను షాకయ్యానని చెప్పాడు. స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యాక ఉదయ్ సడెన్‌గా ప్రాజెక్ట్ నుంచి వైదొలగడంతో తాను ఆగ్రహానికి గురయ్యానని..
వెంటనే ఆ పాత్రకి వేరే ఆర్టిస్టుని తీసుకున్నానని నాటి సంగతులు చెప్పాడు రవిబాబు. తన జీవితంలో చేసిన మొదటి తప్పు అదేనని.. ఇక మళ్లీ ఎప్పుడు అలాంటి తప్పులు చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ చేయాల్సిన ఆ పాత్రను బాలీవుడ్ నటుడు జుగల్ హన్సరాజ్ చేత చేయించాడు రవిబాబు. సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడంతో సోగ్గాడు కమర్షియల్‌గానూ హిట్ అయ్యింది. ఇది రవిబాబుకి డైరెక్టర్‌గా మూడో చిత్రం కాగా.. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించింది.