సినిమారంగంలో జయాపజయాలు సర్వసాధారణమే అయినప్పటికీ, నేటిట్రెండ్‌లో అపజయం వచ్చిందంటే దాని ప్రభావం నుంచి బయటపడటం అంత తేలికగా లేదన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ఓ పక్క నటనావతారం, మరోపక్క దర్శకావతారంతో ప్రేక్షకులను అలరించాలన్న అభిరుచితో ముందుకు సాగుతున్న “అల్లరి’ రవిబాబుకు “అల్లరి, అనసూయ, నచ్చావులే, అవును’ వంటి చిత్రాలు దర్శకుడిగా ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి. అయితే వరుసగా రెండు ఫెయిల్యూర్స్ ఎదురైన నేపథ్యంలో ఎంతో జాగ్రత్తగా ఆయన తన తర్వాతి చిత్రాన్ని ప్లాన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిజానికి ప్రతీ సినిమా ముఖ్యమే అయినప్పటికీ, ఫెయిల్యూర్ తర్వాత చేసే సినిమాపై సహజంగానే వత్తిడి ఎక్కువగా ఉంటుందని అంటారు. ఇక రెండు ఫెయిల్యూర్స్ వస్తే వత్తిడి ఇంకేస్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. “లడ్డూబాబు’ చిత్రం ద్వారా అల్లరి నరేష్‌ను టైటిల్ పాత్రలో విభిన్నంగా ఆవిష్కరించినప్పటికీ, ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. ఇక “అవును’ వంటి విజయవంతమైన చిత్రానికి సీక్వెగా తీసిన “అవును 2’ తీవ్రంగా నిరాశపరిచింది.
వరుసగా వచ్చిన రెండు ఫ్లాప్‌ల తర్వాత కోలుకోవడానికి రవిబాబుకు కొంచెం సమయం పట్టింది. ఈ మధ్యనే ఓ ప్రేమకథను తయారుచేసుకుని దానిని సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నూతన నటీనటులతో ఓ ప్రేమకథను తీయాలని ఆయన భావిస్తున్నట్లు పరిశ్రమలో వినిపిస్తోంది. ఆడిషన్స్ ద్వారా హీరోహీరోయిన్లను, ఇతర నటీనటులను ఎంపికచేసే ప్రయత్నంలో ఆయన ఉన్నారట. దీనిని ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై ఆయనే స్వయంగా నిర్మిస్తారని అంటున్నారు.