టాలీవుడ్ స్టార్ హీరోలు అంత త్వరగా కొత్త దర్శకులను నమ్మి సినిమాలు చేయరు. ఒకవేళ చేసినా కూడా ఎలాంటి ప్రయోగాల జోలికి పోకుండా.. పక్కా కమర్షియల్ కథలు చేస్తుంటారు. మాస్ మహారాజా రవితేజ కూడా ఇలానే చేస్తుంటారు. కొత్త దర్శకులను ప్రోత్సహించే రవితేజ కొత్త కథలను మాత్రం ప్రయత్నించడు. పక్కా మాస్ కథల్లోనే నటిస్తాడు. గత పదేళ్లలో రవితేజ.. గోపీచంద్ మలినేని, బాబీ లాంటి ఇద్దరు కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చారు. వీరిద్దరూ తీసినవి మాస సినిమాలే. రీసెంట్ గా రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన ‘క్రాక్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
మళ్లీ ఇంతకాలానికి రవితేజ మరో కొత్త దర్శకుడితో కలిసి పని చేయబోతున్నాడు. ఆ దర్శకుడి పేరు శరత్ మండవ. ఈ కొత్త దర్శకుడు చెప్పిన కథ రవితేజకి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘క్రాక్’ సినిమాలనే ఇది కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆంధ్రాప్రాంతంలో జరిగిన కొన్ని ఘటలన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాలో రవితేజ సరసన ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నటించనుంది. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత త్రినాథరావు నక్కినతో మరో సినిమా చేయబోతున్నాడు. అది పూర్తయిన తరువాత శరత్ సినిమాను మొదలుపెట్టనున్నారు. ‘ఖిలాడి’ సినిమా మే 28న విడుదల కావాల్సి ఉండగా.. త్రినాథరావు నక్కిన సినిమా కూడా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది.