మాస్ మహారాజ్ రవితేజ కు రూ.45 కోట్ల మార్కెట్ ఉంది. కాబట్టి నిర్మాత అతనితో రూ.30 కోట్ల నుండీ రూ.35 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తే టేబుల్ ప్రాఫిట్స్ దక్కుతాయి. రవితేజ ఓ సినిమాకి ఇచ్చిన కాల్ షీట్లని మించి ఓ 10 రోజులు ఎక్కువగా షూటింగ్ లేదా రీ షూట్లలో పాల్గొంటే.. దానికి ఎక్స్ట్రా పారితోషికం ఏమీ డిమాండ్ చేయడు. అలాగే అతని సినిమాకి కనుక నష్టాలు వస్తే.. ఫైనల్ పేమెంట్ తీసుకోడు.
అందుకే అతన్ని నిర్మాతల హీరో అంటుంటారు ఇండస్ట్రీలో..! కానీ ‘ఖిలాడి’ చిత్రానికి నిర్మాతలు ఏకంగా రూ.65 కోట్ల వరకు బడ్జెట్ పెట్టేసారు. దాంతో నిర్మాతకి, బయ్యర్లకి కూడా చాలా నష్టాలు వాటిల్లాయి. ఆ సినిమాని హిందీలో రిలీజ్ చేయించినా.. ఉపయోగం లేకపోయింది. ఆ మూవీ ప్రభావం రవితేజ తర్వాతి సినిమాల పై పడుతుంది అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి లేదు అని ‘టైగర్ నాగేశ్వరరావు’ నిర్మాతలు చెప్పకనే చెప్పారు.
రవితేజ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ నిర్మాతలలో ఒకరైన అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రానికి నిర్మాత. రాబిన్ హుడ్ టైపులో నాగేశ్వరరావు చేసే సాహసాలను ఈ చిత్రంలో చూపించాల్సి ఉంది. కాబట్టి.. ఈ మూవీకి రూ.50 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారట. మేకింగ్ ను బట్టి ఇంకొంత ఎక్కువైనా ఆశ్చర్యపోనవసరం లేదు. రవితేజ గత సినిమా రిజల్ట్ ను పట్టించుకోకుండా నిర్మాతలు ఇంత ధైర్యం చేయడం వెనుక ఇందులో ఉన్న కమర్షియల్ అంశాలే అని స్పష్టమవుతుంది.
నిజానికి పాన్ ఇండియా సినిమాని రూ.50 కోట్ల బడ్జెట్ లో ఫినిష్ చేయడం కూడా చిన్న వ్యవహారం ఏమీ కాదు. ఇక ఈ మధ్యనే ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించారు నిర్మాతలు.వంశీ కృష్ణ ఆకెళ్ళ ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో ఇతను ‘దొంగాట’ ‘జక్కన్న’ వంటి చిత్రాలని తెరకెక్కించాడు.