బాలీవుడ్ నటి రవీనా టాండన్‌కు (Ravina Tandon) చిక్కుల్లో ఇరుక్కుంది. బంగారు బుల్లోడు, ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాల ద్వారా తెలుగువారికి పరిచయమైన ఈ భామ ఆలయ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై శ్రీ లింగరాజ ఆలయ నిర్వాహకులు రవీనాపై భువనేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్కియోలాజీ సర్వే ఇండియా పర్యవేక్షణలోని 11వ శతాబ్దం నాటి శివాలయంలోని నో కెమెరా జోన్లో వ్యాపార ప్రకటన షూట్ చేశారనే ఆరోపణలుపై పోలీసులు కేసు నమోదు చేశారు. “రవీనా టాండన్‌పై ఎక్కడైతే షూట్ చేశారో అక్కడ కెమెరాలు ఉపయోగించకూడదు. ఆ ప్రాంతంలో షూట్ చేయకూడదు అని ఆలయ పాలక మండలి ఇంచార్జి రాజీవ్ లోచన్ చెప్పారు. ఈ వివాదంపై రవీనా టాండన్ స్పందిస్తూ. “మొబైల్ ఫోన్లలో నన్ను ఎవరైనా షూట్ చేశారా? అనే విషయంపై నాకు తెలియదు. నా చుట్టుపక్కల ఉన్నవాళ్ల చేతిలో సెల్‌ఫోన్లు ఉన్నాయి. చాలా మంది నాతో సెల్ఫీలు దిగారు” అని రవీనా టాండన్ చెప్పింది.
“ఆలయ నిబంధనలకు విరుద్ధంగా భక్తులు సెల్‌ఫోన్లను తీసుకెళ్లినప్పుడు ఎందుకు తనిఖీలు చేయలేదు. నేను ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు పోలీసులు నన్ను తనిఖీ చేయలేదు. నా హ్యాండ్‌బ్యాంగ్‌ను చెక్ చేయలేదు. అలాంటప్పుడు ఫిర్యాదు ఎలా చేస్తారు ?” అని రవీనా ఎదురు ప్రశ్నించారు. ఇంకా మాట్లాడుతూ. ” పురాతన ఆలయాలు, సంప్రదాయాలు అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటివరకు చాలా ఆలయాలను సందర్శించాను. ఎప్పుడు ఆలయ నిబంధనలను ఉల్లంఘించలేదు” అని రవీనా చెప్పింది. మరి పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.