మాస్ మహా రాజా రవి తేజ స్వయం శక్తితో పైకి వచ్చిన వ్యక్తి. పూరీ జగన్నాధ్ తీసిన ‘ఇడియట్’ సినిమా రవికి జీవితాన్ని ఇవ్వగా, ఇక ఆతరువాత వరుసగా భారీ హిట్స్ కొడుతూ దూసుకుపోయాడు రవి. అయితే ఒకానొక సమయంలో రవికి ‘డిజాస్టర్స్’ పలకరించాయి. ఇక రవి పని అయిపోయింది అన్న వాదన సైతం బలంగా వినపడింది. ఏ సినిమా చేసిన ఫ్లాప్ తప్పా, కనీసం ఆవరేజ్ టాక్ కూడా వచ్చేది కాదు. అలాంటి సమయంలోనే ‘బలుపు’ సినిమా రవికి మళ్లీ పునర్జన్మను ప్రసాదించింది. ఇక ఆతరువాత వచ్చిన సినిమాల్లో ఒక్క కిక్ మినహా ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’ మంచి టాక్ తో హిట్ గా నిలిచాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అప్పట్లో రవి పరాజయాల బాటలో ఉన్న సమయంలో తన రెమ్యునిరేషన్ ను సగానికి తగ్గించుకుని మరీ సినిమాలు సైన్ చేశాడు అని తెలిసింది. ఇక ఇప్పుడు ఫార్మ్ లో ఉన్నాడుగా అందుకే తన రెమ్యునిరేషన్ ను అమాంతంగా పెంచేసాడని టాలీవుడ్ టాక్. మొన్నామధ్య రవి హీరోగా వేణు శ్రీరాం డైరెక్టర్ గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒక సినిమా ఉంటుంది అని మీడియాకు తెలిపాడు, కానీ మన హీరోగారు ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో లైట్ తీసుకున్నాడని టాలీవుడ్ లో టాక్, అదే క్రమంలో రీసెంట్ గా చక్రి అనే కొత్త డైరెక్టర్ తో రాబిన్ హుడ్ పేరుతో నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ ఓ మూవీ చేయాలని అనుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా ను కూడా ఎంపిక చేశాడు అని కూడా తెలిసింది, కానీ ఇప్పుడు అదే సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కనీసం 9 కోట్లు ఇవ్వందే కుదరదు అంటున్నాడు రవి. మరి దీనిపై నిర్మాత ఏం ఆలోచిస్తాడో చూడాలి. అయితే ఆశ పడొచ్చు కానీ, మరీ ఒకేసారి అంత పెంచేస్తే నిర్మాతలు సైతం రవిని దూరంగా పెట్టడం ఖాయం. ఎందుకంటే అసలే మనకు యువ హీరోలు ఎక్కువైపోయారుగా.