రవితేజ ప్రతి సంవత్సరం సంక్రాంతికి రావాలని ప్లాన్ చేస్తారు. ఈ మేరకు ఓ సినిమాను ప్లాన్ చేస్తారు కూడా. కొన్నిసార్లు సినిమా పూర్తవ్వక రాలేకపోతే, మరికొన్నిసార్లు థియేటర్ల సమీకరణాల వల్ల సినిమాను వెనక్కి లాగేస్తుంటారు. ఇప్పుడు ఏమవుతుందో తెలియదు కానీ 2026 సంక్రాంతికి మరోసారి రవితేజ రెడీ అయిపోయాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమాను ఎలాగైనా సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. సంక్రాంతి లక్ష్యంగానే చిత్రీకరణ ప్రారంభించుకున్న టీమ్.. ఇప్పుడు అదే డేట్‌కి ఫిక్స్ అయి పనులు చేస్తోందట.
అంతేకాదు సినిమా రిలీజ్‌కి డేట్‌ని కూడా దాదాపు ఫిక్స్ చేసుకున్నారట. అన్నీ అనుకున్నట్లుగా సాగితే జనవరి 13ను లాక్ చేసుకున్నారట. సినిమా షూటింగ్‌ను అక్టోబరు చివరి నాటికి పూర్తి చేసేలా కిషోర్ తిరుమల షూటింగ్ చేస్తున్నారట. ‘అనార్కలి’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా కూడా వస్తే వచ్చే సంక్రాంతి మరింత రంజుగా మారుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఆ సీజన్ మీద చిరంజీవి, ప్రభాస్ కర్చీఫ్ వేసేశారు. ఇక బాలయ్య, నవీన్ పొలిశెట్టి కూడా అప్పుడే వస్తాం అంటున్నారని టాక్.
చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’, ప్రభాస్ ‘ది రాజాసాబ్’, బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ పొంగల్ ఫైట్‌కి వస్తే.. 22 ఏళ్ల క్రితం జరిగిన పోరు మళ్లీ జరుగుతుంది. అప్పటి సంక్రాంతి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ ఇప్పుడు మరోసారి ఢీ అంటే ఢీ అనబోతున్నారు. 2004లో ‘లక్ష్మీ నరసింహా’ అంటూ బాలకృష్ణ.. ‘అంజి’గా చిరంజీవి.. ‘వర్షం’తో ప్రభాస్ వచ్చారు. ఇందులో ప్రభాస్ సినిమా ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ కాగా, బాలయ్య సినిమా మంచి ఫలితమే అందుకుంది. ఇక చిరంజీవి సినిమా ఇబ్బందికర ఫలితం అందుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ పోరు మధ్యలో రవితేజ వస్తాడా? లేక సమీకరణాలు కుదరక ఇంకేదైనా ప్రాజెక్ట్ వెనక్కి వెళ్తుంది అని తెలిసి రవితేజ ఇప్పుడు రెడీ అయ్యారా అనేది త్వరలో తెలుస్తుంది. చూద్దాం పొంగల్ ఫైట్ – 2026 ఎలా ఉండబోతుందో?