Akhanda & Rajasaab: అత్యాశకు పోయి అసలుకే మోసం తెచ్చుకుని.. రెండు పెద్ద ఫ్లాప్‌లకు కారణాలు
- January 23, 2026 / 06:58 PM ISTByFilmy Focus Desk
నేల విడిచి సాము చేయకూడదు, అతి సర్వత్రా వర్జయేత్.. ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. ఇది ఎక్కడైనా ఎలా అనుకుంటారో తెలియదు కానీ.. సినిమాల్లో మాత్రం పర్‌ఫెక్ట్‌గా వర్కవుట్ అవుతుంది. ఈ రెండు అంశాలను సరిగ్గా పట్టించుకోకపోతే సినిమాలు హరీమంటాయి. ఇది చిన్న హీరోలు, చిన్న దర్శకులకే కాదు.. పెద్ద దర్శకులు, పెద్ద హీరోలకు కూడా వర్తిస్తుంది. దీనికి అచ్చంగా ఉదాహరణలు కావాలంటే ‘అఖండ 2: తాండవం’, ‘ప్రభాస్ రాజా సాబ్’ సినిమాల గురించి చెప్పుకోవచ్చు.
Akhanda & Rajasaab
ఈ సినిమా ఫలితాల గురించి ఇప్పుడు మాట్లాడితే ఫ్యాన్స్ హర్టవ్వొచ్చు కానీ.. ఆ సినిమాలకు ఉన్న హైప్, సత్తా, ఓపెనింగ్ బజ్ చూశాక ఫైనల్ ఫలితం చూసి ఎవరైనా ఇదే మాట చెబుతారు. సినిమాకు పెట్టిన ఖర్చు, వచ్చిన క్రేజ్ సరిగ్గా వాడుకోలేదు. వాడుకున్నా అది కలసి రాలేదు. ఏమైందా అని చిన్నగా పోస్ట్ మార్టం చేస్తే నేల విడిచి సాము చేశారు అనిపిస్తుంది. అంటే టాలీవుడ్, తెలుగు ప్రేక్షకు ఎమోషన్స్ పక్కన పెట్టేసి ఓవర్ హైప్ కోసం సినిమాలో ప్రయత్నాలు చేయడమే అని అర్థమవుతుంది
కావాలంటే ‘అఖండ 2: తాండవం’ సినిమానే చూడండి. సినిమాను తెలుగు నేల వరకు పరిమితం చేసి ఉంటే.. హిందీ ప్రేక్షకుల కోసం, అక్కడి వారి మెప్పు కోసం అనవసర హంగులు తప్పేవి. ఆ హంగులు, పక్క దేశాల ప్రస్తావనలు కలిపి సినిమాను మన నుండి దూరంగా తీసుకెళ్లిపోయాయి. అవన్నీ కలిపి అతి సర్వత్రా వర్జయేత్ అనేలా ఓవర్‌గా కనిపించాయి. ఇప్పుడు అదే ఇబ్బంది పెట్టింది. సినిమా ఫలితం సరిగ్గా రాక ఆ సినిమా గురించి ఎవరూ ప్రచారం కూడా చేయలేని పరిస్థితి వచ్చింది.
ఇక ‘రాజాసాబ్’ విషయానికొస్తే.. ఇది ఇంకో రకం పరిస్థితి. ప్రభాస్ రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా కాబట్టి.. మారుతి తన మార్క్ లోకల్ కామెడీని పక్కనపెట్టి పాన్ ఇండియా అప్పీల్ కోసం ట్రై చేశారు. ఇది కనెక్టివిటీని తగ్గించి ఏదో కృతకంగా మారిపోయింది. కాబట్టి పాన్ ఇండియా మోజులో తెలుగు నేటివిటీ, ఇక్కడి జనాల ఆసక్తులు మరచిపోకూడదు అనేది ఆ రెండు సినిమాల ఫలితాల సారం అని చెప్పొచ్చు.













