తెలుగు సినిమాలకు సంక్రాంతి సీజన్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది కరోనా బెడద ఉన్నప్పటికీ నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక మిగిలిన మూడు సినిమాలు ‘మాస్టర్’, ‘రెడ్’, ‘అల్లుడు అదుర్స్’ ఒక్కో డేట్ ని పంచుకున్నాయి. 13న ‘మాస్టర్’, 14న ‘రెడ్’, 15న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలు రిలీజ్ కానున్నాయి.
డేట్లు ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’ సినిమా ఒకరోజు ముందుకు జరిగి 14న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా సినిమాను ముందుకు జరపాలనే నిర్ణయం ‘రెడ్’ టీమ్ కి మింగుడు పడడం లేదు. ముందే డేట్లు లాక్ చేసుకొని, థియేటర్లు లాక్ చేసుకుంటే.. ఇప్పుడు సడెన్ గా ఆఖరి నిమిషాల్లో నిర్ణయం మార్చడం ఏంటంటూ ‘రెడ్’ టీమ్ వాదిస్తోంది. ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయాల మేరకు.. ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు పోటీ పడడానికి వీలు లేదు.
ముఖ్యంగా పండగ సీజన్లలో డేట్లు క్లాష్ అవ్వకుండా ప్రొడ్యూసర్ గిల్డ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. నిర్మాతలతో ముందుగానే చర్చలు జరిపి క్లాష్ అవ్వకుండా చూసుకుంటుంది. అలాంటి ఇప్పుడు సడెన్ గా ‘అల్లుడు అదుర్స్’ డేట్ మారడం గిల్డ్ లో సైతం చర్చనీయాంశమైంది. గిల్డ్ సభ్యులు ఇప్పుడు ఇరు చిత్ర నిర్మాతలను పిలిచి మాట్లాడే పనిలో ఉన్నారు. ఈ వ్యవహారాన్ని సైలెంట్ గా సద్దుమణిగేలా చూస్తున్నారు. మరి ‘అల్లుడు అదుర్స్’ దర్శకనిర్మాతలు ఈ విషయంలో రాజీ పడతారేమో చూడాలి!