మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే రీమేక్ సినిమాలలో నటించారు. అయితే రీమేక్ సినిమాలలో చిరంజీవి నటించి మెజారిటీ సందర్భాల్లో సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ తో చిరంజీవి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రీమేక్ సినిమాలు చిరంజీవి కెరీర్ కు ఒక విధంగా ప్లస్ అవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల వల్ల కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే కత్తి రీమేక్ ఖైదీ నంబర్ 150 సినిమాతో చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు మించి విజయం సాధించింది. మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎంతగానో నచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించగా పాజిటివ్ టాక్ వచ్చినా భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది.
చిరంజీవి హీరోగా స్ట్రెయిట్ సినిమాగా తెరకెక్కిన సైరా రిజల్ట్ ఫ్యాన్స్ ను బాధించింది. కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి, చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమా కమర్షియల్ గా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని అందరూ భావించగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. అయితే చిరంజీవి మళ్లీ లూసిఫర్ రీమేక్ అయిన గాడ్ ఫాదర్ తో సక్సెస్ సాధించారు.
చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్, ఠాగూర్, గ్యాంగ్ లీడర్, హిట్లర్, ఘరానా మొగుడు, పసివాడి ప్రాణం, ఖైదీ నంబర్ 786, విజేత, దొంగమొగుడు ఇతర భాషల సినిమాలకు రీమేక్ గా తెరకెక్కి కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి. కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు రీమేక్ సినిమాలు కావడం గమనార్హం.