తమిళనాట వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ కథానాయకుడు శివకార్తికేయన్ నటించగా ఘన విజయం సాధించిన “రెమో” చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. శివకార్తికేయన్ సరసన లక్కీ హీరోయిన్ కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : ఎస్.కె అలియాస్ రెమోకు (శివకార్తికేయన్) చిన్నప్పట్నుంచి సినిమాలంటే విపరీతమైన యావ. ఆ యావతోనే చదువును అటకెక్కించి సినిమాలు చూస్తూ కాలం గడిపేస్తుంటాడు. ఎప్పటికైనా హీరో అవ్వాలన్నదే ఎస్.కె ఆశయం. అమ్మాయిలంటే ఆమడ దూరంలో ఉండే ఎస్.కె మొదటి చూపులోనే కావ్య (కీర్తి సురేష్) ను ప్రేమించేస్తాడు. అయితే.. అప్పటికే కావ్యకు ఎంగేజ్ మెంట్ అయ్యిందని తెలుసుకొని బాధపడతాడు. కట్ చేస్తే.. ఒక సినిమాలో హీరో క్యారెక్టర్ కోసం లేడీ నర్స్ గెటప్ వేసిన ఎస్.కెను అభిమానంతో చేరదీస్తుంది కావ్య. తాను పనిచేసే హాస్పిటల్ లోనే నర్స్ గా జాయిన్ చేయించడంతోపాటు.. తనకు సన్నిహితురాలిగా చూసుకొంటుంది. సో, ఎస్.కె గా కనీసం కావ్యను పలకరించలేకపోయిన మన హీరో రెమోగా ఆమె దరిన చేరడంతోపాటు అప్పటివరకూ ఆమె మనసులో లేని ప్రేమ భావాన్ని కలిగిస్తాడు. చివరికి కావ్య-ఎస్.కెల ప్రేమ ఫలించిందా, అందుకోసం ఎస్.కె లేడీ నర్స్ రెమోగా మారి పడిన శ్రమ ఏంటి? వంటి విషయాలకు ఆరోగ్యకరమైన హాస్యాన్ని జోడించి రెండున్నర గంటలపాటు అలరించిన చిత్రమే “రెమో”.
నటీనటుల పనితీరు : శివకార్తికేయన్ ఎస్.కె / రెమో పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. ఎస్.కె గా చాలా ఈజ్ తో నటిస్తూనే, రెమోగా లేడీ నర్స్ క్యారెక్టర్ ను బాడీ లాంగ్వేజ్ తో సహా పండించిన తీరు ప్రశంసనీయం. యూత్ ఆడియన్స్ అందరూ శివకార్తికేయన్ క్యారెక్టర్ కు విశేషంగా కనెక్ట్ అవుతారు. తన మునుపటి చిత్రం “రైల్”లో ఎక్స్ ప్రెషన్ పెట్టకుండా ఆడియన్స్ కు చిరాకు తెప్పించిన కీర్తి సురేష్.. “రెమో”లో నటిగా ఇంప్రూవ్ అవ్వడంతోపాటు సన్నివేశానికి తగ్గట్లుగా హావభావాల ప్రదర్శనతో మంచి మార్కులు సంపాదించుకొంది. శివకార్తికేయన్ తల్లి పాత్రలో శరణ్య అమాయకత్వంతో ఆకట్టుకోగా.. స్నేహితుడి పాత్రలో సతీష్ పంచ్ డైలాగ్స్ తో విశేషంగా నవ్వించాడు.
సాంకేతికవర్గం పనితీరు : అనిరుధ్ బాణీలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్. అలాగే తమిళ పాటల్ని తెలుగీకరించిన రచయిత శ్రీమణి సమకూర్చిన సాహిత్యం పాటలకు వేల్యూ యాడ్ చేశాయి. పి.సి.శ్రీరామ్ కెమెరా వర్క్ ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ఎస్సెట్. సినిమా మొత్తాన్ని ఎల్లో టింట్ లో షూట్ చేయడం వల్ల ఆడియన్స్ కి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడంతోపాటు.. సన్నివేశానికి బాగా కనెక్ట్ అయ్యాడు. అలాగే.. ప్రతి సన్నివేశంలో ఏదో ఒక మూలన ఎల్లో కలర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్న పి.సి.శ్రీరామ్ ఒక సినిమాకి మంచి కెమెరామెన్ ఉండడం వల్ల ఉపయోగం ఏమిటనేదానికి ప్రత్యక్ష నిదర్శనంలా నిలిచారు.
రాజేష్ సంభాషణలు, పంచ్ డైలాగ్స్ థియేటర్ లో జనాల్ని విశేషంగా అలరిస్తాయి. ముఖ్యంగా.. “ప్రపంచంలో సగం మంది అమ్మాయిలకు తెలియదు, అబ్బాయిలు చేసే తప్పులు అమ్మాయిల కోసమే” లాంటి సంభాషణలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంటాయి. ఎడిటింగ్ మొదలుకొని అన్నీ పోస్ట్ ప్రొడక్షన్ విషయాల్లోనూ నిర్మాతలు చూపిన శ్రద్ధ ధియేటర్ లో సినిమా చూస్తున్న ఆడియన్స్ మొహాలపై అగుపిస్తుంటుంది.
దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ ఎంచుకొన్న కథలో కొత్తదనం ఇసుమంతైనా లేదు, అయితే.. ఆ కథను అతడు నడిపించిన విధానం, లేడీ నర్స్ పాత్రతో పండించిన కామెడీ, ఎటువంటి ట్విస్టులు లేకుండా రాసుకొన్న స్క్రీన్ ప్లే, కొన్ని ఎమోషన్స్ ను డైలాగ్స్ లో కంటే తెరపై నటీనటుల హావభావాలతోనే పలికించిన తీరు బాగున్నాయి. మొత్తానికి ఓ రెండున్నర గంటలపాటు ఎక్కడా ల్యాగ్ లేకుండా లవ్ స్టోరీలో ఆడియన్స్ ను ఇన్వాల్వ్ చేసిన దర్శకుడు సూపర్ హిట్ ను సొంతం చేసుకొన్నాడు.
విశ్లేషణ : సినిమా చూసే ప్రేక్షకుడికి ఎప్పుడూ లాజిక్ తో పని ఉండదు. ఓ రెండున్నర గంటలపాటు సీట్ లో నుంచి లేవకుండా మ్యాజిక్ చేయగలిగితే చాలు. “రెమో” సినిమా విజయం సాధించింది ఆ విషయంలోనే. సినిమా మొత్తానికి ఎక్కడా ల్యాగ్ లేకుండా జాగ్రత్తపడిన చిత్ర యూనిట్ ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో అలరించగలిగారు. దాంతో ప్రేక్షకులు ఈ సినిమాకి సూపర్ హిట్ రిజల్ట్ ప్రసాదిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. యువతతోపాటు పెద్దలు కూడా కుటుంబంతో సహా చూసి ఆనందించగల లవ్లీ కామెడీ ఎంటర్ టైనర్ “రెమో”.