కుటుంబ పెద్ద లేకపోతే ఆ కూటుంబం పరిస్థితి ఎంత చిన్నాభిన్నంగా ఉంటుందో ప్రస్తుతం చిత్ర పరిశ్రమ పోకడ అలానే ఉంది. కత్తి మహేష్ ఇష్యూ మొదలుకొని మొన్నటి శ్రీరెడ్డి ఇష్యూ వరకూ సినిమా ఇండస్ట్రీలో ఈ తరహా అనవసరమైన గొడవలు ఏం జరిగినా అందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు “దాసరి నారాయణ రావు“. పెద్దాయన ఉండి ఉంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదేమో అని అందరూ అనుకున్నారు. కానీ.. అదే పెద్దాయన ఇండస్ట్రీలో నలుగురు మాత్రమే రాజ్యమేళుతున్నారు, చిన్న సినిమాని బ్రతకానివ్వండి అని వేడుకొన్నప్పుడు మాత్రం ‘ఈ పెద్దాయన గోలేంటో?” అనుకున్నవాళ్లే ఎక్కువ. అయితే.. ఇప్పుడు ఆయన లేని లోటు మాత్రం బాగా తెలుస్తోంది.
ఎందుకంటే.. నిజంగా దాసరిగారు గనుక బ్రతికి ఉంటే అసలు ఈ ఇష్యూస్ అని రచ్చకెక్కకపోదును, ఆయన తన ఇంట్లోనే ఈ గొడవలన్నీ సర్ద్ధిచెప్పేవారు. దాదాపు ఒక 20 ఏళ్లపాటు దాసరి నారాయణరావుగారు ఇండస్ట్రీకి పెదరాయుడిలా వ్యవహరించారంటే అతిశయోక్తి కాదేమో. కానీ.. ఆయన దివంగతులయ్యాక ఆయన స్థానాన్ని మాత్రం ఎవరు భర్తీ చేయలేకపోయారు అనేది మాత్రం నిజం. దాసరి తర్వాత ఆయన స్థాయి పెద్దరికం, పలుకుబడి కలిగింవారెవరూ ఇండస్ట్రీ పెద్దగా ఉండేందుకు ముందుకు రాలేదు. నిజానికి ఇండస్ట్రీ పెద్దగా మెలిగే హోదా కానీ అర్హత కానీ మెండుగా కలిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయనేమో సినిమాల్లో బిజీగా ఉండడం వలన ఇండస్ట్రీకి పెద్ద మనిషి లేకుండాపోయాడు. ఇప్పటికైనా లేట్ ఏమీ అవ్వలేదు. ఇండస్ట్రీలోని సీనియర్ హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో ఒకరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తే ఇప్పటికైనా ఇండస్ట్రీ వ్యవహారాలు టీవీలకెక్కకుండా లోలోపలే సెటిల్ అవుతాయి. లేదంటే ఇదే విధంగా అనవసరమైన రచ్చలు జరిగి ఇండస్ట్రీ పరుగు పోవడం ఖాయం.