మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ‘వినయ విధేయ రామా’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ‘టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్’ కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవిలు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. ఇక ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ చిత్ర ట్రైలర్ బోయపాటి గత చిత్రాలకు మాదిరిగానే రొటీన్ గానే ఉంది. అయితే ఈ చిత్ర ట్రైలర్ కు ఎక్కువ వ్యూస్ వస్తున్నప్పటికీ.. అభిమానులు మాత్రం నిరాశతోనే ఉన్నారు. రొటీన్ సినిమాల భారీ నుండీ ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్న చరణ్ ‘ధృవ’ ‘రంగస్థలం’ చిత్రాలతో ఆ ఫోబియా నుండీ బయటపడ్డాడు అని అభిమానులు సంతోషించేలోపే.. మళ్ళీ ఇలాంటి రొటీన్ ప్లాట్ ను చరణ్ ఎంచుకోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ‘వినయ విధేయ రామా’ చిత్రంలో వినయంగా ఉండే రాముడు కనిపించలేదు… విధ్వంస రాముడే కనిపించాడు అంటూ ఒక సందర్భంలో ‘కేటీఆర్’ కూడా అనేశాడు.
ఇక ‘వినయ విధేయ రామా’ ట్రైలర్ పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించాడు. రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… “గోల్డ్, డైమండ్స్ మిక్స్ చేస్తే ‘వినయ విధేయ రామ’ ట్రైలర్. బోయపాటి ట్రైలర్ వావ్ అనిపించేలా ఉంది. రాంచరణ్ సింపుల్ గా మైండ్ బ్లోయింగ్ గా కనిపిస్తున్నాడు.’జంజీర్’ బదులు హిందీలో రాంచరణ్ కి ఇది మొదటి సినిమా అయ్యుంటే బాగుండేది” అంటూ రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. అయితే రాంగోపాల్ వర్మ ట్రైలర్ ను తిట్టాడా.. పొగిడాడా… అనే సంకోచంలో మెగా అభిమానులు ఉన్నట్టు… వర్మ ట్వీట్ కు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ సంక్రాంతికి మాస్ సినిమా ఆదరణ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ‘వినయ విధేయ రామా’ కు మంచి స్పందన వచ్చే అవకాలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు.