ఇటీవల అషురెడ్డితో రాంగోపాల్ ఇంటర్వ్యూ జరిగింది. తన డేంజరస్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఇది యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఇందులో అషురెడ్డి దర్జాగా కుర్చీలో కూర్చుని హుక్కా కొడుతుంటే.. వర్మ మాత్రం ఆమె పాదాల వద్ద కూర్చుని .. ఆమె పాదాలు నాకుతున్నాడు. ఈ వీడియో చూసిన ఓ అభిమాని చాలా ఎమోషనల్ అయ్యాడు. వర్మ చనిపోయాడు అంటూ అగ్రెసివ్ గా ఓ లెటర్ రాసుకొచ్చాడు. ఇలాంటి అభిమానులను వర్మ నమ్మడు, లెక్క చేయడు అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లెటర్ లో మంచి ఎమోషన్, డెప్త్ ఉంది. అందుకే వైరల్ గా మారింది.
సదరు అభిమాని ఆ లెటర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలుపుతూ… ” మనిషి మనిషిలా బతకడం ఓ కళ అంటారు. కానీ అందరికి ఆ కళ ఉండదు, అందరు అలా బతకరు. చాలా మంది పక్కింటోడికి భయపడి.. ఎదురింటోడికి భయపడి.. ఈ సమాజానికి భయపడి ఎప్పుడో మరణించినా గానీ బతికే ఉన్నాం అన్న భ్రమలో బతుకుతున్నారు. ఈ భ్రమలన్నింటినీ బద్దలు కొడుతూ.. తాను చెయ్యాలనుకుంది తాను చేస్తూ.. తన ఇష్టం వచ్చినట్లు బతుకుతోంది ఓ జీవి.
ఆ జీవి పేరే RGV. ఈ జీవి గురించి నేను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ప్రపంచానికి పరిచయం చేసిన కొత్త వాటిని మాత్రం గుర్తు చేయాల్సిన సందర్భం వచ్చింది. “శివ, సర్కార్, రంగీలా, సత్య” లాంటి పాన్ ఇండియా సినిమాలను 30 సంవత్సరాల క్రితమే తీసిన వర్మ.. అషురెడ్డి కాళ్లు నాకడానికి కారణం ఏంటి? అప్పటి వర్మ చనిపోయాడా? ఇప్పుడు బతుకుతున్న వర్మ వేరేనా?
1962 ఏప్రిల్ 7 న అన్ని జీవులు వచ్చినట్లుగానే ఈ భూమ్మిదికి వచ్చింది రామ్ గోపాల్ వర్మ అనే జీవి. కానీ.. అన్ని జీవులు బతికినట్లుగా బతకలేదు అతడు. మాటల్లో, చేతల్లో ఈ సమాజానికి ఎప్పుడు విరుద్దంగానే నడుచుకునే వాడు. కానీ ఏనాడూ చట్టానికి వ్యతిరేకంగా వెళ్లలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇప్పుడు మనమందరం పాన్ ఇండియా సినిమాలు అని జబ్బలు చరుచుకుని చెప్పుకుంటున్న సినిమాలన్ని 30 సంవత్సరాల క్రితమే తీసి చూపించాడు వర్మ. తొలి చిత్రంతోనే సంచలనాలు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఆ తర్వాత వరుస హిట్ సినిమాలతో వర్మ పేరుగా కంటే ఓ బ్రాండ్ గా మారిపోయాడు. బాలీవుడ్ లో అడుగు పెట్టి, అక్కడ ఓ కంపెనీ పెట్టి.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను ‘సర్కార్’ గా తనవైపు తిప్పుకున్న తెగువ ఆర్జీవీ సొంతం. చిత్ర పరిశ్రమకి టెక్నాలజీలో ఓనమాలు నేర్పిన గురువు ఈ వర్మ. మరి అలాంటి వర్మ ఓ యువతి కాళ్ళ దగ్గర కూర్చునే స్థాయికి దిగజారాడా? లేదా దిగజారాడు అని మనం అనుకుంటున్నామా? హిట్ సినిమాలు తీసే వర్మ మరణించాడా? ఇన్ని ప్రశ్నల మధ్య ఓ అభిమాని ఓపెన్ లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఓపెన్ లెటర్ లో అభిమాని ఈ విధంగా రాసుకొచ్చాడు.
“డియర్ వర్మ.. నీ ఫస్ట్ సినిమా చూసినప్పుడే అనుకున్నా.. వీడు అందరి లాంటి డైరెక్టర్ కాదు అని. ఆ తర్వాత అద్భుతమైన సినిమాలు తీసి.. నేను నమ్మిన నిజాన్ని.. నిజం చేశావ్. ఓ మూస పద్ధతిలో వెళ్తున్న చిత్ర పరిశ్రమకు దిక్సూచిగా మారావు. ఈ క్రమంలోనే నేను నీ అభిమానిగా.. కాదు కాదు.. వీరాభిమానిగా మారిపోయాను. ఇక్కడ ఓ విషయం చెప్పాలి.. నీ అభిమాని అని చెప్పుకోవడానికి చాలా మంది సిగ్గు పడుతుంటారు. కానీ అలా చెప్పుకోడానికి ఉండాల్సింది సిగ్గు కాదు.. గుండె ధైర్యం. ఆ గుండె ధైర్యం నీ దగ్గర్నించి వచ్చిందే వర్మ. నువ్వు ఏ గుండె ధైర్యంతో బాలీవుడ్ లో అడుగుపెట్టి.. “సత్య, కంపెనీ, సర్కార్, రంగీలా” లాంటి ఆణిముత్యాలను అందించావో ఆ గుండె ధైర్యమే.
ఇక కెమెరాలను సృష్టించిన వాడి కంటే ఎక్కువగా వాటిని వాడుతున్నావ్ చూడు.. అక్కడే మేమంతా పడిపోయాం. ఒక్క రోజులో సినిమా తియ్యడం, సెల్ ఫోన్ లో సినిమా తీయ్యడం లాంటి ఐడియాలు నీకు ఎలా వస్తాయి అసలు. బహుశా నువ్వు అందరి డైరెక్టర్లలా వాటర్ తాగి ఆలోచించవ్.. వొడ్కా తాగి ఆలోస్తావ్ కాబట్టి కాబోలు. అయితే గత కొన్ని రోజులుగా అందరు నిన్ను అప్పటి వర్మ చనిపోయాడు.. చనిపోయాడు అంటున్నారు. కానీ వాళ్లందరికి తెలీదు నువ్వు ఎప్పుడో చనిపోయావని. అవును నువ్వెప్పుడో మరణించావు! ఆ విషయం నీకూ తెలుసు.. ఓ అభిమానిగా నాకూ తెలుసు! పాపం బ్రతుకుతున్నాం అని భ్రమలో జస్ట్ బతుకు ఈడుస్తున్న ఈ జనాలకేం తెలుసు?
ఎంతటి అవతారపురుషుడికైనా, ఎంత సాధారణ జీవికైనా.. పుట్టుకకి ఒక కారణం ఉంటుంది. రాముడు, కృష్ణుడు కూడా అందుకు అతీతం కాలేదు. అంతటి మహాభారత యుద్దాన్ని నడిపించిన కృష్ణుడు కూడా.. యుద్ధం ముగిశాక ఒక బోయి చేతిలో అతి సామాన్యుడిలా చనిపోయాడు. ఇలా.. అందరూ తమ పుట్టుకకి కారణమైన కార్యాలు చేసి చనిపోతున్నారు. కానీ.., నువ్వు మాత్రం చేయాల్సిన గొప్ప సినిమాలు, సాధించాల్సిన కీర్తి, 30 ఏళ్ళ క్రితమే సాధించేశావు. కానీ.. దేవుడు మాత్రం నిన్ను ఇక్కడే వదిలేశాడు. సరిగ్గా..
అలాంటి సమయంలోనే కారణ జన్ముడైన డైరెక్టర్ గా చనిపోయి, సాధారణ మనిషిగా మళ్ళీ పుట్టావు. అప్పటి నుండి నీకు నచ్చినట్టే బతుకుతున్నావు. ఇది.. నువ్వు.. నీలా ఉండటానికి నీకు.. నువ్వు ఆనందంగా రాసుకున్న మరణ శాసనం. ఇదంతా తెలియక పిచ్చి జనం అంతా నిన్ను పట్టుకుని మళ్ళీ శివ లాంటి సినిమా ఎప్పుడు తీస్తావు అని నిన్ను అడుగుతుంటే.. నీతో పాటు నేను కూడా నవ్వుకున్న సందర్భాలు ఎన్నో.
నా గురువు RGVని విమర్శించే వాళ్ళకి కూడా ఇక్కడ కొన్ని మాటలు చెప్పాలి అనుకుంటున్నా. వర్మ.. అప్సర రాణితో, అషు రెడ్డితో చేసిన, చేస్తున్న వీడియోలు చూసి.. వర్మకు ఆడవాళ్ల మీద గౌవరం లేదు అని అంటున్నారు కదా? మీరందరు ఇక్కడ ఓ విషయాన్ని మర్చిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ”మీ టూ” ఉద్యమం గురించి మీ అందరికి తెలిసిందే. మహామహులైన డైరెక్టర్లు, నిర్మాతలపై బోలెడు లైంగిక ఆరోపణలు వచ్చాయి. అంత ఉవ్వెత్తున ఎగసిన ‘మీ టూ’ అగ్ని జ్వాలల్లోంచి ఒక్క మహిళా నటి కూడా ఆరోపణ చేయకుండా మేలిమి బంగారంలా మెరిసింది నా గురువు “RGV” అని చెప్పడానికి గర్వపడతాను. ఇప్పుడు చెప్పండి మహిళలపై గౌరవం లేనిది వర్మకా.. అలా ఆలోచించే మీకా?
ఇక వర్మ టాలెంట్ గురించి మాట్లాడతారా? ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నారు రాజమౌళి. కానీ 80, 90వ దశకాల్లోనే RGV పాన్ ఇండియా మూవీలు తీసి ఇండస్ట్రీలో ఎవరెస్ట్ శిఖరాన్ని ముద్దాడిన సంగతి మీకుతెలీదు కాబోలు. కానీ ఓ అభిమానిగా ఆ విషయాలను సమాజానికి గుర్తు చేయాల్సిన గురుతర బాధ్యత నామీద ఉంది. అందుకే RGV నా దృష్టిలో 10 మంది రాజమౌళీలతో సమానం. ఈ మాట వినేవాళ్లకు కోపం రావచ్చు.. కానీ.. నా అభిమానం “నా ఇష్టం”. ఇక వర్మ చనిపోయాడా? బతికే ఉన్నాడా? అన్నది మీ ఇష్టం.
చివరగా ఇక అషురెడ్డి కాళ్ళ దగ్గరికే వద్దాం. నిజానికి నచ్చిన, కావాల్సిన దానికోసం మనిషి ఎంతకైన దిగజారుతాడు. ఇది నమ్మలేని నిజం. మీరిక్కడ నచ్చిన, కావాల్సిన అంటే ఏదో బూతు అనుకోకండి. దానికి అర్థం ఆ సమయంలో మనకు నచ్చినట్లు మనం ఉండటమే. ఇప్పుడు RGV చేస్తుంది అదే. మీకందరికి అదో బూతులా కనపడుతుంది కాబోలు. కానీ వర్మ దృష్టిలో అది కరెక్ట్. ఇప్పుడు చెప్పండి.. ఎంత మంది ఇలా RGVలా చనిపోయి బతకగలరు? అది ఒక్క RGV కి మాత్రమే సాధ్యం. ఇక చివరిగా చచ్చి బతుకుతున్న వర్మ.. నీకు ఇవే నా శుభాకాంక్షలు RIP RGV’ ఇట్లు, సిగ్గులేని నీ అభిమాని ” అంటూ పేర్కొన్నాడు.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!