రామ్‌గోపాల్ వర్మ మనసు పెట్టి చేయాలే కానీ… ఏ జోనర్ అయినా ఆయన జోనర్‌గా మారిపోవాల్సిందే. అందుకే ఇండస్ట్రీలో ఏ డైరక్టరూ చేయని, చేయలేని సినిమాలు చేశారు… అంతే స్థాయిలో మెప్పించారు. అయితే మొన్నీ మధ్య రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్లు… ‘అప్పటి ఆర్జీవీ ఇప్పుడు కనిపించడం లేదు’. అయితే ఆ ఆర్జీవీ ఏమో కానీ, పొలిటికల్ కాంట్రవర్శీ ఉందని తెలిసినా… సినిమాలు చేసే ఆర్జీవీ మాత్రం మళ్లీ ముందుకొచ్చాడు.
తెలుగు సినిమాల్లో రికార్డు కలెక్షన్లు కురిపించిన జోనర్ ఏదన్నా ఉంది అంటే అది ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్. అగ్ర హీరోలు చాలామంది ఇలాంటి సినిమాలు చేసి బాక్సాఫీసు దగ్గర దమ్ము చూపించారు. వర్మ కూడా ‘రక్తచరిత్ర’ పేరుతో రెండు సినిమాలు తీసి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి ఆ తరహా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈసారి వెబ్‌సిరీస్. ‘కడప్ప’ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొన్ని దశాబ్దాల నుండి ఫ్యాక్షన్ వార్ కారణంగా రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో వందలాదిమంది ప్రాణాలు బలైపోయాయి.
అలాంటి ప్రతీకారజ్వాలల నేపథ్యంలో తీస్తున్న మెగా వెబ్‌సిరీస్ ‘కడప్ప’. ఇందులో మొదటి రెండు సీజన్లు పరిటాల హరి, పరిటాల రవి జీవితాల ఆధారంగా ఉంటాయి. ఒక ప్రాంతపు వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నాం. తెలుగు, హిందీ భాషల్లో ఓటీటీలో రిలీజ్ చేస్తాం. చూద్దాం మరి వర్మ ఏం చేస్తాడో, ఏం చూపిస్తాడో?