రోమాంటిక్ క్రిమినల్స్

తక్కువ బడ్జెట్ లో సమాజంలోని సమస్యలను వేలెత్తి చూపేలా సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం “రోమాంటిక్ క్రిమినల్స్”. మనోజ్ నందన్, అవంతిక ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ప్రోమోస్ కాస్త విభిన్నంగా ఉంటుందేమోననే ఆసక్తి నెలకొంది. మరి సినిమా కూడా ఆసక్తికరంగా సాగిందా లేదా అనేది చూద్దాం..!!

కథ: అప్పటికే డ్రగ్స్ కు అలవాటుపడిన ఏంజెల్ (అవంతిక) అప్పుడే కాలేజ్ లో చేరిన జూనియర్ కార్తీక్ (మనోజ్ నందన్)తో ప్రేమలో పడి.. అతడికి కూడా డ్రగ్స్ లాంటివి అలవాటు చేస్తుంది. డ్రగ్స్ అమ్మే వ్యక్తి, ఆ డ్రగ్స్ అమ్మేవాడి స్నేహితులు.. ఇలా పలువురు ఏంజెల్-కార్తీక్ ల జీవితాల్లో తెలియకుండానే భాగస్వాములవుతారు.

ఈ డ్రగ్స్ అనేవి వారి జీవితాలను ఎలా నాశనం చేసింది? సమాజంలో డ్రగ్స్ కారణంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఎలాంటివి, వాటికి వారు ఎలా బానిసలవుతున్నారు? అనేది “రోమాంటిక్ క్రిమినల్స్” కథాంశం.

నటీనటుల పనితీరు: మనోజ్ నందన్ తక్కువతో తక్కువ ఒక 20 సినిమాలు చేసి ఉంటాడు. ఒక నటుడిగా అతడి పెర్ఫార్మెన్స్ కు పేరు పెట్టాల్సిన అవసరం లేదు కానీ.. రాను రాను అతడు ఎంచుకొనే పాత్రల్లో మాత్రం వైవిధ్యం లోపిస్తోంది. తనకు “ఒక రోమాంటిక్ క్రైమ్ కథ” లాంటి సినిమాలో లైఫ్ ఇచ్చాడన్న ఒకే ఒక్క కారణంగా సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించే ప్రతి సినిమాలో నటిస్తున్నాడు మనోజ్. మరి సినిమాలో ఇష్టపడి నటిస్తున్నాడో లేక కష్టపడి చేస్తున్నాడో తెలియదు కానీ.. ఏదో చేయాలి అన్నట్లుగా చేస్తున్నాడు.

ఏంజెల్ పాత్రలో ఒక డ్రగ్ ఎడిక్ట్ గా అవంతిక సహజంగానే నటించింది. కానీ.. ఆమె వ్యవహారశైలిని ప్రేక్షకులకు రుచించదు. అలాగే దివ్య, మౌనిక పాత్రలు నిజానికి చాలా దగ్గరగా ఉన్నాయి. కానీ.. ఆ పాత్రలు ప్రేక్షకులకు మింగుడుపడవు.

సాంకేతికవర్గం పనితీరు: సునీల్ కుమార్ రెడ్డి సినిమాలు మనం రోజూ చూసే న్యూస్ పేపర్ లో దారుణాలకు చాలా దగ్గరగా ఉంటాయి, అయితే.. ఆ సందర్భాలు చదవడానికి బాగున్నంతగా సినిమాగా చూడ్డానికి బాగోదు. సునీల్ కుమార్ రెడ్డి సినిమాలు కూడా అంతే.. కథగా బాగున్నంతగా కథాంశం కానీ సన్నివేశాలు కానీ ఆకట్టుకోవు. ఒక నిజాన్ని “ఇది నిజం” అని చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. మల విసర్జన యొక్క సమస్యలకు పరిష్కారం మార్గం చెప్పేటప్పుడు ఆ మలాన్ని చూపకపోవడం అనేది ఎంత హేయంగా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాలా. ఒక సినిమా కూడా అంతే.. ఏదో హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది కదా అని వికృతమైన సన్నివేశాలు సహజత్వం పేరుతో తెరకెక్కించాల్సిన అవసరం లేదు. అలా చూపిస్తే అక్కడ సమస్యగా చూపించిన శృంగార సన్నివేశం హైలైట్ అవుతుందే తప్ప.. సమాధానంగా చూపిన విషయం కానీ వివరం కానీ ఎవరికీ పట్టవు.

“ఒక రోమాంటిక్ క్రైమ్ కథ” సమయానికి అది ఒక డిజిటల్ విప్లవం, ఆ సినిమాలో అమ్మాయిల ఆలోచనా విధానం కానీ స్టూడెంట్స్ డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేయడానికి ఎలా రెడీ అయిపోతున్నారు అనేది హార్డ్ హిట్టింగ్ గా, అసభ్యానికి తావు లేకుండా తెరకెక్కించారు కాబట్టి యువతతోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆ చిత్రాన్ని ఆదరించారు. కానీ.. “ఒక క్రిమినల్ ప్రేమకథ”లో అమ్మాయిలు తమ కుటుంబ సభ్యుల కారణంగా ఎదుర్కొనే లైంగిక ఇబ్బందులను పచ్చిగా చూపించారు సునీల్ కుమార్ రెడ్డి.. ఆ సినిమాను అన్నీ వర్గాల ప్రేక్షకులు చూడలేకపోయినా చూసిన కొందరు మాత్రం నిజమే కదా అని ముక్కున వేలేసుకొన్నారు. కారణం ఆ చిత్రంలో చూపించిన కథాంశం కానీ పాత్రలు కానీ నిజం కదా అనిపిస్తుంటాయి. కానీ.. “రోమాంటిక్ క్రిమినల్స్” కథలో నిజం ఉన్నా అది గత కొన్నేళ్లుగా జరుగుతున్న విషయమే.. సమస్యలు నిజానికి దగ్గరగా ఉన్నా.. వాటిని తెరకెక్కించిన విధానం మాత్రం నిజానికి చాలా దూరంగా ఉన్నాయి. ఆ కారణంగా “రోమాంటిక్ క్రిమినల్స్” అనే సినిమాలో సహజత్వంతోపాటు రిలేటబిలిటీ అనేది లేకుండాపోయింది.

ఇక సినిమాటోగ్రఫీ, సంగీతం లాంటి సాంకేతికపరమైన అంశాల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది.. అందుకు కారణం ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏదో ఒక తక్కువ బడ్జెట్ షార్ట్ ఫిలిమ్ చూస్తున్న ఫీల్ తప్ప.. సినిమా చూస్తున్న ఫీల్ మాత్రం ఎక్కడా రాదు.

“సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్” లాంటి ఆలోచనాత్మక చిత్రాలు తెరకెక్కించిన సునీల్ కుమార్ రెడ్డి లాంటి దర్శకుడు “రోమాంటిక్ క్రిమినల్స్” లాంటి చిత్రాన్ని తెరకెక్కించడం అనేది బాధాకరమైన విషయం. ఈ సినిమా తీసిన బడ్జెట్ బట్టి, రిలీజ్ చేసే ఏరియాల బట్టి ప్రాఫిక్స్ వచ్చే అవకాశాలున్నప్పటికీ.. సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడిగా తన స్థాయిని తగ్గించుకొన్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

విశ్లేషణ: కథ-కథనంతో సంబంధం లేకుండా కేవలం కొన్ని జుగుప్సాకరమైన శృంగార సన్నివేశాలు చూసి సంతోషిస్తాం అనుకొనే ప్రేక్షకులు మాత్రమే చూడదగ్గ సినిమా “రోమాంటిక్ క్రిమినల్స్”.

రేటింగ్: 0.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus