‘సెవెన్’లో థ్రిల్‌తో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది

  • February 14, 2020 / 01:40 PM IST

హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 5న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హవీష్ తో ఇంటర్వ్యూ…

ఓ హీరో, ఆరుగురు హీరోయిన్లు… ‘సెవెన్’ టైటిల్ జస్టిఫికేషన్ అంతేనా? మిస్టరీ ఏమైనా ఉందా?

ఒక హీరో ప్లస్ ఆరుగురు హీరోయిన్లు ఈక్వల్స్ టు సెవెన్. ప్రధాన పాత్ర పోషించిన రెహమాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ‘సెవెన్’ క్యారెక్టర్స్. నేను ఎప్పుడూ థ్రిల్లర్ చేద్దామని అనుకోలేదు. నాకు థ్రిల్లర్స్ ఇష్టం ఉండదు. లో బడ్జెట్ లో పిచ్చి పిచ్చిగా చేస్తారనిపించింది. థ్రిల్లర్, హారర్ ఎప్పుడూ చేద్దామని అనుకోలేదు. రమేష్ వర్మగారు కథ చెప్పినప్పుడు నచ్చింది. వర్కవుట్ అవుతుందని అనిపించింది. నేను ఫైటింగ్ ఫిల్మ్, కామెడీ ఫిల్మ్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కథ విన్నప్పుడు వర్కవుట్ అవుతుందనిపిస్తే ఓకే చేస్తా. సినిమా బడ్జెట్ రూ. 2 కోట్లా? 20 కోట్లా? అనేది నాకు సంబంధం లేదు.

టైటిల్ ‘7’ లోగోలో కింద అంతా ఎర్రగా ఉంది!

అదేంటో తెలియాలంటే సినిమా చూడాలి. కొందరు ‘ఎర్ర గులాబీ’లా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ, అంత సీరియస్ గా ఉండదు. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. సాంగ్స్ ఏ ఫ్లేవర్ లో ఉన్నాయో… సినిమా ఆ ఫ్లేవర్ లో ఉంటుంది. ఆల్రెడీ విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. మూడు పాటలకు మూడూ హిట్టయ్యాయి. సాధారణంగా థ్రిల్లర్ అనగానే డ్రైగా, ప్రేమకథ లేకుండా టెన్షన్ టెన్షన్ గా ఉంటాయి. ‘సెవెన్’ మాత్రం అలా ఉండదు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తరహాలో ఉంటుంది. సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు. అంతమందిని పెట్టుకుని డ్రైగా సినిమా తీయలేం కదా. లవ్, రొమాన్స్ ఉన్నాయి.

ఆరుగురు హీరోయిన్లలో మెయిన్ హీరోయిన్ ఎవరు?

ఆరుగురూ మెయిన్ హీరోయిన్లే. లేకపోతే ఆరుగురు ఎందుకు చేస్తారు చెప్పండి? బేసిగ్గా… ఒకరికి మరొకరితో పడదు. సెట్ లో ఇద్దరు ఉంటే నాకు భయం వేసేది. ఒకరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మరొకరు ఫీలవుతారేమో అని పిచ్చ భయం వేసేది. కానీ, అటువంటిది ఏమీ లేదు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కి కథలో ఇంపార్టెన్స్ ఉంది. అందుకని, ఆరుగురు చేశారు. ఆరుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేయడం కోసం తీసుకోలేదు. వాళ్ళతో పాటు నేను కూడా ఈక్వలే. హీరో మీద సినిమా నడిస్తే నాకిష్టం ఉండదు. కథాబలం మీద సినిమా నడవాలని అనుకుంటాను. ఉదాహరణకు… ‘రామ్ లీలా’లో ఇద్దరు హీరోలున్నారు. నా క్యారెక్టర్ 25 నిమిషాల తరవాత వస్తుంది. నా మీదే సినిమా ఉండాలని నేను అనుకుంటే ఆ సినిమా చేసేవాడిని కాదు కదా.

ఆరుగురితో నటించడం?

కొంచం టఫ్. ఒక హీరోయిన్‌తో అలవాటు పడేలోపల ఆ అమ్మాయితో సన్నివేశాలు పూర్తి చేసి, మార్చేసే వారు. మళ్ళీ ఇంకొక హీరోయిన్. జ‌న‌ర‌ల్‌గా హీరోయిన్‌ని ప‌ట్టుకోవాలంటే భ‌యం వేస్తుంది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. హీరోయిన్ మారిన ప్రతిసారీ భయం వేసేది.

ఆరుగురికీ లిప్ లాక్స్ పెట్టారు కదా…!

ఫస్ట్ డే షూటింగులో కిస్ పెట్టామన్నారు. ‘నేను పెట్టను. ముందు నాకు చెప్పలేదు. హీరోయిన్ కొడితే? ఏం చేయాలి?’ అని అడిగా. ఇంతకుముందు సినిమాల్లో హీరోయిన్లను నేను పట్టుకొను కూడా పట్టుకోలేదు. ఆ రోజు చేయలేదు. తరవాత రోజు నిర్మాత వచ్చి సీరియస్ అయ్యారు. ‘మీరు కిస్ పెట్టనంటే ఎలా? సినిమాలు నడిచేది ఎలా?’ అని. వ్యంగ్యంగా అంటున్నారేమో అనుకున్నాను. మూడు రోజులు అలాగే అన్నారు. మా నాన్నగారి ముందు కూడా అదే చెబుతున్నారు. అప్పుడు ఆయన సీరియస్ గా తిడుతున్నారని అర్థమైంది. ‘హీరోయిన్ కి ఓకే అయితే నాకు ఓకే. ముందు ఆ అమ్మాయికి చెప్పండి’ అన్నాను. ‘హీరోయిన్ కి చెప్పకుండా మీకు ఎందుకు చెబుతాం?’ అన్నారు. ముందు కిస్ సీన్స్ ఉన్నట్టు నాకు చెప్పలేదు. కిస్సెస్ ఐడియా నిజార్ షఫీది అనుకుంట.

రమేష్ వర్మ కథ రాశారు. ఆయన ఎందుకు డైరెక్ట్ చేయలేదు?

ప్రొడక్షన్, డైరెక్షన్ కష్టమవుతుందేమో అన్నారు. అప్పుడు నేను మంచి సినిమాటోగ్రఫర్ చేతిలో కథ పెడదామని నిజార్ షఫీని సజెస్ట్ చేశా. అతను చాలా బాగా చేశాడు. తను కాబట్టి తెలుగు, తమిళ్ చేశాడు. అక్కడి కల్చర్, మన కల్చర్ అర్థం చేసుకుని తీశాడు.

తెలుగు, తమిళం… బైలింగ్వల్ చేయడానికి కారణం ఏంటి?

తెలుగు సినిమాగా స్టార్ట్ చేశాం. మరో నాలుగు రోజుల్లో సినిమా స్టార్ట్ అవుతుందనగా… తెలుగులో ఇద్దరు ముగ్గురు నిర్మాతలున్నారు. వారిలో జవహర్ గారు ఒకరు. ఆయన ఫ్రెండ్, ఒక తమిళియన్ హైదరాబాద్ వస్తే… ఈ కథ వినిపించారు. ఆయనకు కథ విపరీతంగా నచ్చేయడంతో ‘నేను మీకు ఇంత అమౌంట్ ఇస్తాను. నాకు తమిళ్ కాపీ ఇవ్వాలి. తమిళంలో అన్ని డైలాగులను షూట్ చేయాలి’ అని కండిషన్ పెట్టారు. దర్శకుడు నిజార్ షఫీ తమిళియన్ కావడంతో తమిళ్ కూడా స్టార్ అయింది. షూటింగ్ ముందు రోజు నాకు తమిళ్ డైలాగులు ఇచ్చారు. లిటరల్ గా 1000 టైమ్స్ చదివా. అయినా రాలేదు. రెండు డైలాగులు చెప్పడానికి 25 మినిట్స్ తీసుకున్నా. అయినా రాలేదు. నిర్మాతల దగ్గరకు వెళ్లి ‘తమిళంలో వేరే హీరోతో చేయండి. నన్ను వదిలేయండి. నేను చెప్పలేను. తమిళ్ చేయడానికి సైన్ చేయలేదు’ అన్నాను. వాళ్ళు ఒప్పుకోలేదు. ‘ఒక 20 రోజులు షూటింగ్ ఎక్కువ అయినా పర్లేదు. బడ్జెట్ ఎక్కువ అయినా ఓకే’ అన్నారు. హీరోయిన్లు అందరూ తమిళంలో సినిమాలు చేశారు. వారి సహకారంతో పూర్తి చేశా.

సినిమా ఎవరికైనా చూపించారా? ఏమన్నారు?

మా బావగారు తమిళియన్. ఆయన తమిళ్ సినిమా డబుల్ పాజిటివ్ చూశారు. ఆయనకు బాగా నచ్చింది. ‘మీరు ఎక్కడ నుంచి కాపీ కొట్టారు?’ అని అడిగారు. ‘ఎక్కడా కాపీ కొట్టలేదు’ అని చెప్పా. ఈ కథను హిందీలో తీసినా… కన్నడలో, మలయాళంలో ఎక్కడ చేసినా వర్కవుట్ అవుతుంది.

సాధారణంగా సినిమాలు శుక్రవారం విడుదలవుతాయి. మీరు బుధవారం విడుదల చేస్తున్నారేంటి?

మా సినిమాను విడుదల చేస్తున్న అభిషేక్ నామా గారిని అడిగా… ‘శుక్రవారం కాకుండా బుధవారం విడుదల చేస్తున్నారేంటి? జూన్ 5న వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఉంది కదా’ అని! ఆయన ‘5న ఈద్, సెలవు రోజు. ఐదు నుంచి తొమ్మిదో తేదీ వరకూ సెలవులు. అందుకని, విడుదల చేస్తున్నాం’ అన్నారు.

మీ లాస్ట్ సినిమాకు, ఈ సినిమాకు గ్యాప్ వచ్చినట్టుంది?

మధ్యలో ఒక పెద్ద సినిమా చేయాలి. అనుకోకుండా వాళ్ళు వేరే హీరోతో ముందుకు వెళ్లడంతో నాకు గ్యాప్ వచ్చింది. నా ఫీలింగ్ ఏంటంటే… జీవితం మొత్తం మీద ఒక్క సినిమా చేసినా పర్వాలేదు కానీ, మంచి సినిమా చేయాలి. అందుకని, నన్ను ఎగ్జైట్ చేయని కథలు చేయలేను.

తదుపరి సినిమాలు?

‘సెవెన్’ ట్రైలర్ విడుదలయ్యాక… నాకు మూడు ఆఫర్స్ వచ్చాయి. అందులో అభిషేక్ నామాగారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ప్రారంభమైంది. బెక్కం వేణుగోపాల్ గారి సినిమా ఆల్మోస్ట్ అయిపోతుంది. తమిళంలో ‘ట్రైడెంట్’ రవి అడిగారు.

మీరు నిర్మాతగా చేస్తున్న ‘రాక్షసుడు’ గురించి?

ఎక్స్‌ట్రాడిన‌రీ మూవీ. తెలుగులో చాలామంది నిర్మాతలు రైట్స్ కోసం పోటీపడ్డారు. మా సంస్థలో తొలి సినిమాగా చేస్తే బావుంటుందని చేశాం. ‘సెవెన్’ డబుల్ పాజిటివ్ చూసి, నాన్నగారు రమేష్ వర్మకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ‘సెవెన్’ పూర్తయ్యే సరికి ‘రాక్షసుడు’ రైట్స్ కొన్నాం. రీమేక్ కాబట్టి త్వరగా సింగిల్ షెడ్యూల్ లో రెండు ఫైట్స్ మినహా షూటింగ్ పూర్తి చేశాం.

అందులో మీరెందుకు నటించలేదు?

వెన్’ థ్రిల్లర్. ‘రాక్షసుడు’ కూడా థ్రిల్లర్. అన్నీ నేను చేయడం కంటే నా బ్యానర్ ఎస్టాబ్లిష్ కావాలి కదా. ఇతర హీరోలతో కూడా చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ ‘రాక్షసుడు’ బిజినెస్ పూర్తయింది. నిర్మాతగా హ్యాపీ. జులై 18న విడుదల చేస్తున్నాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus