బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాక్ష్యం”. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మించగా.. ఏరోస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలా కాకుండా లాజికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించానని దర్శకుడు శ్రీవాస్ చెప్పిన మాటలు ఎంతవరకూ నిజమో చూద్దాం..!!
కథ : మునుస్వామి (జగపతిబాబు) మరియు అతడి తమ్ముళ్ళు (రవికిషన్, అశుతోష్ రాణా తదితరులు) అత్యంత క్రూరులు. తాము చేసే అవినీతి వ్యాపారాలకి ఎవరు అడ్డొచ్చినా ఎలాంటి “సాక్ష్యం” లేకుండా వారిని అంతమొందించి తమ కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకి లేకుండా చూసుకొంటుంటారు. అయితే.. స్వస్తిక్ గ్రామానికి పెద్ద అయిన రాజుగారు (శరత్ కుమార్) మాత్రం మునుస్వామికి అస్తమానం అడ్డుపడుతుంటాడు. అప్పటివరకూ ఉరిపెద్ద కాబట్టి ఏమీ అనలేక, చేయలేక మిన్నకుండిపోయిన మునుస్వామి.. ఈసారి రాజుగారు ఏకంగా తన తమ్ముడ్ని నిర్భందించడంతో కోపంతో ఆ కుటుంబం మొత్తాన్ని అత్యంత దారుణంగా హతమారుస్తాడు. అయితే.. ఆ దేవీ కటాక్షం కారణంగా కుటుంబం మొత్తానికి ఒక్కడు మాత్రం మిగిలిపోతాడు. అలా బ్రతికి, మరో కుటుంబం పంచన పెరిగి పెద్దయిన వాడే విశ్వ (బెల్లంకొండ శ్రీనివాస్).
అయితే.. మునుస్వామి తాను చేసిన పాపానికి ఎలాంటి సాక్ష్యం లేదని విర్రవీగుతున్న పొగరు అణచడానికి ప్రకృతే సాక్ష్యంగా నిలుస్తుంది. 20 ఏళ్లపాటు తనకొక కుటుంబం ఉందన్న విషయం కూడా తెలియకుండా అమెరికాలో మరొక కుటుంబం పంచన పెరిగిన విశ్వ తాను ప్రేమించిన సౌందర్య లహరి (పూజా హెగ్డే) కోసం ఇండియా వస్తాడు. అప్పట్నుంచి ఆ ప్రకృతి విశ్వను తన ఆయుధంగా మార్చుకొని మునుస్వామి & బ్రదర్స్ ను ఎలా అంతమొందించింది అనేది “సాక్ష్యం” చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు : బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా కోసం డూప్స్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేశాడు, డ్యాన్సులు ఇరగదీశాడు కానీ నటనలో అత్యంత ముఖ్యమైన హావభావాల ప్రకటనను మాత్రం పంచభూతాల్లో ఒకటైన గాలికి వదిలేశాడు. ఎమోషనల్ అవుతున్నాడో, సీరియస్ అవుతున్నాడో అర్ధం కాక ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అవుతుంటాడు. తన మునుపటి చిత్రాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొన్న శ్రీనివాస్ ఈ చిత్రంలో ఆ విషయంలోనూ ఫెయిల్ అవ్వడం గమనార్హం. పూజా హెగ్డే ఈ చిత్రంలోని సౌందర్య లహరి అనే పాత్రకు మిస్ ఫిట్. అమ్మడు అందంగా కనిపించింది, చాలా సన్నివేశాల్లో కష్టమైన తెలుగు పదాలకు లిప్ సింక్ ఇచ్చి తాను పాత్ర కోసం ఎంత కష్టపడతాను అనేది తెలియజేసినప్పటికీ.. క్యారెక్టర్ లో మాత్రం ఒదగలేకపోయింది.
జగపతిబాబు సినిమాలోని మొదటి 15 నిమిషాల్లో పండించిన విలనిజం పీక్ లో ఉండగా.. మిగతా భాగం మొత్తం రొటీన్ గా ఉంది. ఆయన చెప్పే వేమన పద్యాలు మాత్రం వినసోంపుగా ఉన్నాయి. లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ సపోర్టింగ్ రోల్ ప్లే చేసి ఆశ్చర్యపరిచాడు. అతడి క్యారెక్టర్ కి మంచి ఎలివేషన్ తోపాటు సినిమా కథ మొత్తం అతడి చుట్టూనే తిరగడంతో ఆడియన్స్ కు అనంత్ బాగా రీచ్ అవుతాడు. రావు రమేష్, జయప్రకాష్, అశుతోష్ రాణా, రవికిషన్, కబీర్ దుహాన్ సింగ్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు : హర్షవర్ధన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టులా నిలిచింది. సినిమాలోని కంటెంట్, ఎమోషన్ తో సంబంధం లేకుండా తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాడు. పాటలు కొత్తగా ఉన్నా క్యాచీగా లేకపోవడం.. ఆ పాటల ప్లేస్ మెంట్ తోపాటు చిత్రీకరణ కూడా పెద్దగా ఆకట్టుకొనే విధంగా లేకపోవడంతో వాటి గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేకుండాపోయింది. ఆర్ధర్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్. యాక్షన్ సీక్వెన్స్ లు మినహా ఆయన కెమెరా వర్క్ సినిమాకి కాస్టీ లుక్ తీసుకొచ్చింది. ప్రతి ఫ్రేమ్ లో అభిషేక్ నామా ఏమాత్రం భయపడకుండా ఖర్చుపెట్టిన డబ్బు కనిపిస్తూనే ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లను పీటర్ హెయిన్స్ మాస్టర్ కంపోజ్ చేసిన విధానం బాగోలేదో లేక ఆ సీక్వెన్స్ లను కెమెరాతో బంధించిన విధానం బాగోలేదో తెలియదు కానీ. యాక్షన్ సీక్వెన్స్ లు జరుగుతున్నంతసేపూ.. ఎప్పటికీ పూర్తవుతాయా అని ఎదురుచూస్తుంటాడు ప్రేక్షకుడు. సాధారణంగా యాక్షన్ సీక్వెన్స్ లంటే లాజిక్ తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేసే మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమాలోని స్లో యాక్షన్ సీక్వెన్స్ ల కారణంగా నీరసించిపోతాడు.
“సాక్ష్యం” సినిమా విషయంలో మెచ్చుకోవాల్సిన మరో సాంకేతికత వి.ఎఫ్.ఎక్స్ వర్క్. చాలా సహజంగా అనిపించాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఆంబోతు గ్రాఫిక్స్ వర్క్ అంటే నమ్మడం కాస్త కష్టమే, అంత నేచురల్ గా ఉంది సీజీ వర్క్.
ఇలా సంగీతం, సినిమాటోగ్రఫీ, సీజీ వర్క్ అన్నీ బాగున్న సినిమాకి మైనస్ గా నిలిచిన అంశం ఏమిటి అని ఆలోచిస్తే.. థియేటర్ నుంచి బయటకి వస్తున్న ప్రతి ఒక్కరి మెదడులో మెదిలే విషయం “కథనం”. దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రం కోసం రాసుకొన్న కథ, ఎంచుకొన్న పాయింట్ చాలా కొత్తగా ఉన్నాయి. అన్నీ కమర్షియల్ అంశాలతోపాటు ఖర్మ సిద్ధాంతాన్ని కూడా జోడించి సినిమా తెరకెక్కించాలన్న ఆలోచన గొప్పదే. కానీ ఆ కథను, ఆలోచనను ప్రేక్షకులకు అర్ధమయ్యేలా ఆసక్తికరంగా చెప్పాలన్న ధృడ నిశ్చయం మాత్రం లోపించింది. అందుకే.. సినిమా చాలా చోట్ల బోర్ కొడుతుంది. కథ ఏమిటి అనేది మొదటి 15 నిమిషాల్లోనే చెప్పేశాడు కాబట్టి కేవలం కథనంతోనే ఆకట్టుకోవాలన్న లాజిక్ తెలిసి కూడా శ్రీవాస్ 166 నిమిషాల పాటు సినిమాని సాగదీయడం అనేది పెద్ద మైనస్. సో, ఒక రచయితగా సక్సెస్ అయిన శ్రీవాస్ “సాక్ష్యం”తో ఒక దర్శకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాడు.
విశ్లేషణ : సినిమాకి దర్శకుడి విజన్ తోపాటు ప్లానింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో అర్ధమయ్యేలా చేసే సినిమా “సాక్ష్యం”. టెక్నికల్ గా అన్నీ అంశాలు అద్భుతంగా ఉన్న ఈ సినిమా సాగదీసిన కథనం, లాంగ్ రన్ టైమ్ కారణంగా ఆడియన్స్ కు బోర్ కొట్టిస్తుంది.
రేటింగ్ : 2/5