రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) స్కూల్ నుండి వచ్చిన తాజా చిత్రం “శారీ” (Saaree). తనకు ఇన్స్టాగ్రామ్ లో నచ్చిన అమ్మాయి ఆరాధ్య దేవిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ.. వర్మ రచించగా, ఆయన శిష్యుడు గిరికృష్ణ కమల్ (Giri Krishna Kamal) తెరకెక్కించిన చిత్రమిది. వీరలెవల్లో ప్రమోషన్స్ చేసినప్పటికీ, ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు తీసుకురాలేకపోయారు మేకర్స్. మరి సినిమా ఎలా ఉంది, వర్మ మార్క్ ఎంటర్టైన్మెంట్ ను అందించగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: పార్కులో పక్షులకు ఫోటోలు తీస్తుండగా.. పసుపు రంగు చీరలో కనిపించిన ఆరాధ్య దేవి (ఆరాధ్య దేవి)ని (Aaradhya Devi) తొలి చూపులోనే కామిస్తాడు రషీద్ అలియాస్ కిట్టు (సత్య యాదు (Satya Yadu). ఆమెను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి, మెసేజ్ చేసి ఆమెకు ఫొటోషూట్ చేస్తానని ఆశజూపి ఆమెకు దగ్గరవ్వాలనుకుంటాడు. కట్ చేస్తే.. కిట్టు అసలు నైజం తెలుసుకున్న ఆరాధ్య అతడ్ని దూరం పెడుతుంది. ఆ తర్వాత జరిగిన సంఘటనల సమాహారమే “శారీ” (Saaree) చిత్రం.
నటీనటుల పనితీరు: సైకోగా సత్య యాదు పెర్ఫార్మెన్స్ చూస్తే కొన్ని ఫ్రేమ్స్ లో భయమేస్తుంది కూడా. ఒక నటుడిగా అతడు పాత్రలో జీవించిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. మరీ ముఖ్యంగా తన్నులు తింటున్నప్పుడు సైకాటిక్ బిహేవియర్ ను ఎస్టాబ్లిష్ చేసే విధానం కచ్చితంగా అలరిస్తుంది.
ఆరాధ్య దేవికి ఇది మొదటి సినిమా కాబట్టి ఆమె నటన గురించి పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రతిభ కనబర్చలేకపోయింది. ఇన్స్టాగ్రామ్ లో మోడలింగ్ చేసిన ఎక్స్ పీరియన్స్ ఉండడంతో.. ఎక్స్ ప్రెషన్స్ తో మాత్రం అలరించే ప్రయత్నం చేసింది కానీ.. ఎమోషన్స్ ను పండించడంలో మాత్రం విఫలమైంది. ముఖ్యంగా ఒకపక్క సత్య యాడు నటుడిగా విశ్వరూపం ప్రదర్శిస్తుండగా, అతడి పక్కన బేలగా ఉండిపోయింది ఆరాధ్య. మిగతా సహాయ పాత్రల్లో సాహిల్ (Sahil Sambyal), కల్పలత (Kalpa Latha), అప్పాజీ అంబరీష్ తదితరులు పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: శబరి సినిమాటోగ్రఫీ వర్క్ తప్ప.. సినిమా మొత్తంలో చెప్పుకోదగ్గ అంశం ఒక్కటే లేదు. శబరి మాత్రం వర్మ మార్క్ ఫ్రేమ్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సత్య యాదు మీద ఆరాధ్య ఫోటోలు ప్రొజెక్షన్ పడుతూ తనలో తాను మాట్లాడుకునే సన్నివేశాలు మరియు ఆరాధ్యను కట్టేసి మాట్లాడే సీన్ లో కెమెరా ద్వారా ఆడియన్స్ పర్స్పెక్టివ్ చూపించే ప్రయత్నం వంటివి బాగున్నాయి.
శశిప్రీతం సంగీతం, నేపథ్య సంగీతం కథా గమనానికి ఏమాత్రం తోడ్పడలేకపోయాయి. రాంగోపాల్ వర్మ రచన అనే టైటిల్ కార్డ్ వేసుకోవడంతోపాటు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. రెండిట్లోనూ పెద్దగా పస లేదు.
దర్శకుడు గిరికృష్ణ తన గురువు వర్మ స్టైల్ ను గుడ్డిగా ఫాలో అయిపోయాడు. కెమెరా యాంగిల్స్, ఫ్రేమ్స్, లైటింగ్, కాస్ట్యూమ్స్ అన్నీ వర్మ శైలిలోనే కనిపిస్తాయి. అయితే.. ప్రమోషనల్ కంటెంట్ లో కనిపించిన అతి హింసాత్మకమైన సన్నివేశాలు, అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేసే సన్నివేశాలు సినిమాలో కనిపించకుండా, స్వీయ నియంత్రణ చేసుకోవడం అనేది కాస్త మంచి పని. అయినప్పటికీ.. ఇది చెడు అని చూపించడానికి చెడును మరీ అంత పతాక స్థాయిలో చూపించాలా? ఆ అతిశయానికి విజువల్ రీప్రెజంటేషన్ అవసరమా? అనేది దర్శకుడు తనను తాను ప్రశ్నించుకోవాల్సిన విషయం.
విశ్లేషణ: సమాజంలో సోషల్ మీడియా ద్వారా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి, ముఖ్యంగా అమ్మాయిలు ఈ మాధ్యమాల ద్వారా లెక్కలేనన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది ముమ్మాటికీ నిజమే. అయితే.. వాటికి దూరంగా ఉండాలని మెసేజ్ ఇచ్చే సినిమాల్లో ఆ హింస స్థాయిని మరీ పతాక స్థాయిలో ప్రేక్షకులు ఇబ్బందిపడేలా చూపించాల్సిన అవసరం లేదు. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే విషయం ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పగలిగితే చాలు. ఈ విషయం వర్మ లాంటి లెజండరీ ఫిలిం మేకర్ కి ఫిల్మీఫోకస్ నుంచి మేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎందుకీ పైత్యం? ఎందుకీ పరిధి దాటి అమ్మాయిల మీద జూమ్ షాట్స్? అనేది వర్మ & టీమ్ కే తెలియాలి. వర్మ మీద అపారమైన గౌరవం, ఆరాధ్యదేవి అర్ధనగ్న రూపాన్ని తెరపై చూడాలన్న తపన, ఒక టబ్ పాప్ కార్న్, కొంచం ఓపిక ఉంటే తప్ప “శారీ” చిత్రాన్ని థియేటర్లో 142 నిమిషాలపాటు చూడలేం.
ఫోకస్ పాయింట్: చీరతో చెండాడడం వర్మకి సాధ్యం!
రేటింగ్: 1.5/5