బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది. యంగ్ రెబల్ స్టార్ కాస్త ఇండియన్ స్టార్ గా ఎదిగారు. అందుకే అతని రేంజ్ కి తగ్గట్టు సినిమా ఉండాలని వందకోట్ల బడ్జెట్ ని 150 కోట్లు చేశారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు ఈ మొత్తాన్ని ఖర్చు చేయడానికి సంతోషంగా ముందుకు వచ్చారు. అయితే చిన్న క్యారెక్టెర్స్ కి సైతం బాలీవుడ్ స్టార్స్ ని తీసుకుంటున్నారు. దీంతో రెమ్యునరేషన్ కే వందకోట్లు అయిపోతోంది. ఈ బడ్జెట్ మోయలేక వంశీ ప్రమోద్ లు బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ తో చేతులుకలిపారు. రెండు నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. తాజాగా ఈ మూవీ అబుదాబిలో షూటింగ్ జరుపుకుంటోంది.
40 రోజుల షూటింగ్ కి 90 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మొత్తంతో ఓ స్టార్ హీరో సినిమాని గ్రాండ్ గా కంప్లీట్ చేయవచ్చు.. అటువంటిది ఒక షెడ్యూల్ కే ఖర్చు పెట్టారంటే.. టోటల్ బడ్జెట్ ఎంతవుతుందో అంచనా వేసి షాక్ తింటున్నారు. ఈ మూవీ మొదటి కాపీ వచ్చేసరికి 300 కోట్లు దాటిపోతుందని భావిస్తున్నారు. ఇది బాహుబలి కంటే ఎక్కువ. మరి ఆ స్థాయిలో వసూలు చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కావాలనే బడ్జెట్ ని పెంచి చెబుతున్నారని అనేవారు లేకపోలేదు. మరి వాస్తవం ఏమిటో త్వరలోనే తెలియనుంది.