నిన్ను విజయం ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అపజయం నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఈ రెండూ అతి తక్కువ సమయంలో సాయి ధరమ్ తేజ్ కి అనుభవం అయింది. అతను నటించిన పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తిక్కతో మొదలైన అపజయాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత చేసిన విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్.. ఐలవ్ యూ.. సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. ఈ అపజయాలతో సాయి ధరమ్ తేజ్ కొన్ని పాఠాలు నేర్చుకున్నారని, అందుకే ఇక నుంచి కొన్ని రూల్స్ పక్కాగా పాటించాలని అనుకుంటున్నారంట.
గత రెండేళ్లుగా సాయిధరమ్ తేజ్ ఎంచుకున్న కథలన్నీ ఫ్లాప్ అయ్యాయి.. దీంతో ఈసారి చేయబోయే కథలను తనకు బాగా సన్నిహితులైన సీనియర్లకు చూపించిన తర్వాతే ఓకే చేయాలని డిసైడ్ అయ్యాడట. మరో సారి మేనమామ చిరంజీవి సాంగ్ రీమేక్ చేయకూడదని ఫిక్స్ అయినట్లు తెలిసింది. అలాగే మొహమాటికి సినిమా చేయకూడదని కూడా డిసైడ్ అయిపోయారని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఆరు అపజయాలు పలకరించినప్పటికీ సాయి ధరమ్ తేజ్ తో సినిమా తీయడానికి దర్శకనిర్మాతలు ఉత్సాహంగానే ఉన్నారు. ఆ ఉత్సాహం పోకుండా ఉండాలంటే ఓ రెండు హిట్లు అవసరమని కథలపై కసరత్తు చేస్తున్నారు.