పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి విజయాలతో దూసుకు పోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి వరుసగా తిక్క, విన్నర్, నక్షత్రం రూపంలో అపజయాలు పలకరించాయి. బీవీఎస్ రవి దర్శకత్వంలో చేసిన జవాన్, వినాయక్ దర్శకత్వంలో చేసిన ఇంటిలిజెంట్ కూడా హిట్ ట్రాక్ లోకి తీసుకురాలేకపోయాయి. అందుకే యాక్షన్ ని పక్కన పెట్టి పక్క ప్రేమకథని ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్ కి తొలిప్రేమ వంటి సిల్వర్ జూబ్లీ వంటి చిత్రాన్ని ఇచ్చిన కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్.. తేజ్ ఐ లవ్ యు చిత్రం చేస్తున్నారు. అనుపమ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ జులై 6న రిలీజ్ కానుంది. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం బిజీగా ఉంది.
ఈ సందర్భంగా విష్ణు ఉమెన్స్ కాలేజీలో సాయి ధరమ్ తేజ్ విద్యార్థినీలతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. “ఇంతమంది అమ్మాయిల మధ్య మీరు ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు.. మీకెలా అనిపించింది” అని అడగ్గా… చాలా కొత్తగా ఉందని, తన జీవితంలో ఇటువంటి మీటింగ్ ఇదే ఫస్ట్ టైమ్ అని నవ్వుతూ చెప్పారు. “మీరు ఒకవేళ హీరో కాకపోయి ఉంటే ఏమై ఉండేవారు” అని మరో స్టూడెంట్ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “నేను ఒక అన్ ఎంప్లాయిడ్ గై అయి ఉండేవాడిని. పిట్టగోడల మీద కూర్చొని అమ్మాయిలకు సైట్ కొడుతూ ఉండేవాడిని” అని సరదాగా సమాధానమిచ్చారు. ట్రైలర్ తో విశేషంగా ఆకట్టుకున్న “తేజ్” మూవీ యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మనసుగెలుచుకుంటుందని చిత్ర బృందం ధీమాగా ఉంది.