ఒకప్పటి రాజకీయాలు వేరు. పైగా వైఎస్సార్, చంద్రబాబు వంటి ఇద్దరు స్నేహితులు సృష్టించిన చరిత్ర వేరు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు బ్యాక్ బోన్ గా నిలిస్తే, కాంగ్రెస్ పార్టీకి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బ్యాక్ బోన్ గా నిలిచారు. వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘యాత్ర’ వంటి సినిమాల్లో చూపించారు.
కానీ వీళ్ళు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో వీళ్ళ స్నేహం ఎలా ఉండేది? పార్టీలు మారిన తర్వాత వీళ్ళ మధ్య ఎలాంటి గ్యాప్స్ వచ్చాయి? వంటి ఆసక్తికర అంశాలతో ‘మయసభ’ అనే వెబ్ సిరీస్ రూపొందుతుంది. ‘ప్రస్థానం’ ‘రిపబ్లిక్’ వంటి మంచి సినిమాలు తీసిన దేవా కట్టా ఈ సిరీస్ కు దర్శకుడు. వైఎస్సార్ గా చైతన్య రావ్, చంద్రబాబు నాయుడుగా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్లో వీళ్ళ లుక్స్, క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయనేది చూపించారు. అయితే ఈ సిరీస్ లో ఎన్టీఆర్ గా ఎవరు నటిస్తారు? అనేది సస్పెన్స్ గా మారింది.
అందుకు సమాధానంగా సాయి కుమార్ పేరు బలంగా వినిపిస్తుంది.(జూలై 27న) ఆయన పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ దేవా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిని పోస్ట్ చేస్తూ ఆయన.. ” ‘ఇక్కడ మీరు ఏ పాత్ర పోషించారో కానీ… ‘తుక్కు రేగ్గొట్టారు!!!’ తెలుగు ఆడియన్స్ ఆగస్ట్ 7న మీ నట విశ్వరూపం చూస్తారు’ అంటూ పేర్కొన్నారు. కాషాయ వస్త్రం, కారుపై భారీ ర్యాలీ.. భారీగా అభిమానులు.. ఇవి కారణజన్ముడు సీనియర్ ఎన్టీఆర్ నే తలపిస్తున్నాయి. ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ తర్వాత దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన ‘మయసభ’ సిరీస్లో సాయి కుమార్ నటించడం విశేషంగా చెప్పుకోవాలి.