సినీ సెలబ్రిటీల జీవనశైలి అంటే విలాసవంతమైన జీవితం, ఖరీదైన కార్లు, లగ్జరీ విల్లాలు, పార్టీలతో నిండిన లైఫ్‌స్టైల్‌నే ఊహిస్తాం. చాలా మంది హీరోయిన్లు రోజుకు లక్షల్లో ఖర్చు చేస్తూ, కోట్ల ఆదాయంతో ఆడంబరమైన జీవితాన్ని గడుపుతుంటారు. వీకెండ్ పార్టీలు, ప్రైవేట్ సెక్యూరిటీ, ఖరీదైన బ్రాండెడ్ ఉత్పత్తులు వారి జీవితంలో భాగమవుతాయి. కానీ, ఈ లగ్జరీ జీవితం మధ్యలో కొందరు సెలబ్రిటీలు సరళ జీవనాన్ని ఎంచుకుంటారు, అలాంటి వారిలో సాయి పల్లవి (Sai Pallavi) ఒకరు.
సాయి పల్లవి సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో తన నటనతో భారీ క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ, కోట్లలో ఆదాయం ఆర్జిస్తోంది. అయినప్పటికీ, ఆమె కమర్షియల్ యాడ్స్ జోలికి వెళ్లకుండా, తనకు నచ్చిన కథలతో సినిమాలు మాత్రమే ఎంచుకుంటోంది. అనేక కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆమెను సంప్రదించినప్పటికీ, సాయి పల్లవి అటువైపు ఆసక్తి చూపడం లేదు.
ఆమె ఖర్చు విషయంలో చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తుందని, అవసరం లేని ఖర్చులను పూర్తిగా నివారిస్తుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సాయి పల్లవి ఈ ఆర్థిక క్రమశిక్షణను చిన్నతనం నుంచి అలవాటు చేసుకుంది. ఆమె తల్లి చిన్నప్పుడు ఆమెకు డబ్బు విలువ, అవసరాలను గుర్తించే పాఠాలను నేర్పింది. ఏదైనా కొనాలని అడిగితే, “ఇది నీకు నిజంగా అవసరమా?” అని ప్రశ్నించి, అవసరమైతేనే ఖర్చు చేసేలా నేర్పించింది.
అప్పట్లో ఆ నిర్ణయాలు బాధ కలిగించినా, పెరిగే కొద్దీ తల్లి చెప్పిన ఆర్థిక క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యత సాయి పల్లవికి అర్థమైంది. ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నప్పటికీ, ఆమె అదే క్రమశిక్షణతో ఖర్చు చేస్తుంది. సాయి పల్లవి జీవనశైలి సరళతకు ఒక ఉదాహరణ. ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు, ఆడంబరమైన జీవితం కంటే, తన అవసరాలకు అనుగుణంగా జీవితాన్ని గడుపుతుంది. ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి, దాని అవసరాన్ని అంచనా వేసుకుని నిర్ణయం తీసుకుంటుంది. ఈ క్రమశిక్షణ ఆమె సినిమా ఎంపికల్లోనూ కనిపిస్తుంది. కమర్షియల్ ఆఫర్లు వదిలేసి, తనకు నచ్చిన కథలతో సినిమాలు ఎంచుకుంటుంది.