సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత స్టార్లపై ట్రోలింగ్ కూడా బాగా పెరిగింది. అందుకే సెలబ్రిటీలు ఆచితూచి మాట్లాడుతున్నారు. వారు చేసే కామెంట్స్ కాస్త అటు ఇటుగా ఉన్నా.. నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ చేసి వ్యాఖ్యలు ఇలానే దుమారాన్ని రేపాయి. ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఓంరౌత్ ‘ఆదిపురుష్’ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రావణుడిని పోలిన లంకేష్ పాత్రకు సైఫ్ అలీఖాన్ ని ఎన్నుకున్నారు.
ఇటీవల సినిమా విశేషాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సైఫ్.. రాముడు తన చెల్లెలుశూర్పణక ముక్కు కోసినందుకు ప్రతీకారణంగా రావణుడు.. రాముడి భార్య సీతను ఎందుకు అపహరించాడో.. రాముడితో ఎందుకు యుద్ధం చేశాడో సహేతుకంగా చూపిస్తామని సైఫ్ అన్నారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. రాక్షసుడైన రావణుడిని ‘ఆదిపురుష్’ సినిమాలో హీరోగా చూపిస్తారా..? అంటూ చిత్రబృందాన్ని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. సైఫ్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ మండిపడుతున్నారు.
అయితే విషయం సీరియస్ అయ్యేలా ఉందని గ్రహించిన సైఫ్ ఆలస్యం చేయకుండా వివరణ ఇచ్చేశాడు. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పడంతో పాటు తను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలు కించపరచాలని అనుకోలేదని అన్నారు. రాముడు మంచి, వీరత్వానికి ప్రతీక అని.. చెడుపై మంచి విజయాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు. వాస్తవాలను వక్రీకరించకుండా.. ఈ సినిమాను రూపొందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపాడు.