ఒక్క వ్యక్తే థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే ఎంత ఖర్చవుతుంది. తక్కువలో తక్కువ సింగిల్ స్క్రీన్‌కి వెళ్తే రూ.200/రూ. 250 అవుతుంది. అదే మల్టీప్లెక్స్‌కి వెళ్తే రూ.300/ రూ.400 అవుతుంది. అదే సినిమా విడుదలైన రెండో రోజో, మూడో రోజే ఇంట్లో కూర్చుని రూ.200కే కుటుంబం మొత్తం చూస్తే.. అదిరిపోయింది కదా ఆలోచన. ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. ఇందులో భాగంగా బాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ నడియాడ్‌వాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్మెంట్స్ తొలి అడుగు వేసింది.
అమెజాన్ ప్రైమ్‌తో నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా ఇటీవల ఓ ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం వారి ప్రొడక్షన్ హౌస్ నడియాడ్‌వాలా గ్రాండ్ సన్‌లో రూపొందుతున్న తర్వాతి సినిమాలు ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్ ప్రైమ్‌లోనే వస్తాయి. అది కూడా థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే. అయితే ముందుగా చెల్లించిన సబ్‌స్క్రిప్షన్‌కి సంబంధం లేకుండా అదనంగా డబ్బులు చెల్లించాలట. అందులో విషయం ఏముంది ‘కేజీయఫ్ 2’కి ఇలానే చేశారు కదా అనొచ్చు. అయితే అది సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత వచ్చింది.
కానీ ఇక్కడ థియేటర్లలో సినిమా విడుదలైన వెంటనే ఓటీటీకి రెంటల్ పద్ధతిలో సినిమా వచ్చేస్తుందట. వారి నుండి ఏదైనా సినిమా విడుదలైనప్పుడు ఈ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే రెంటల్ పద్ధతిలో రూ. 199 తీసుకొని సినిమా చూపిస్తారట. అలా రెంట్ చెల్లించిన 48 గంటల్లోగా చూసేయాల్సి ఉంటుంది. నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ నుండి త్వరలో వరుణ్ ధావన్ ‘బావల్’, టైగర్ ష్రాఫ్ ‘బాఘి 4’తోపాటు ‘సాంకీ’ సినిమాలు రాబోతున్నాయి.
వీటితోపాటు నితీశ్ తివారీ, రవి ఉడయవార్, సమీర్ విద్వాన్స్, సాకేత్ చౌదురిల సినిమాలు కూడా ఈ నిర్మాణ సంస్థ నుండి రానున్నాయి. ఈ లెక్కన ఈ సినిమాలన్నీ ఓటీటీలో రెంట్ పద్ధతిలో వస్తాయని చెప్పొచ్చు. అయితే సల్మాన్ ఖాన్ ‘కబీ ఈద్ కబీ దివాళీ’ కూడా ఇదే నిర్మాణ సంస్థ నుండి వస్తుంది. మరి ఆ సినిమాకు ఏం చేస్తారో చూడాలి. బాలీవుడ్‌లో మరికొన్ని నిర్మాణ సంస్థలు కూడా ఇలాంటి ఆలోచన చేస్తున్నాయని చెబుతున్నారు. అదే జరిగితే, ఇతర పరిశ్రమల్లో ఇలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది. మరి తెలుగులో ఏ నిర్మాతలు ఇలా ఆలోచిస్తారో చూడాలి.