ఒకప్పుడు విజయం సాధించిన విజయం గురించి లెక్క కట్టడానికి సినిమా ఎన్ని రోజులు ఆడింది అని లెక్కలేసేవారు. సినిమా పోస్టర్లు కూడా అలానే వచ్చేవి. 50 రోజులు ఇన్ని దగ్గర్లా, 100 రోజులు అన్ని దగ్గర్లా, 175 రోజుల లెక్క ఇదీ.. అంటూ రాసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ పోస్టర్లు కనుమరుగు అయిపోయాయి. ఇప్పుడు అంతా వసూళ్ల చిక్కు లెక్కలే. ఇప్పుడు వీటితోపాటు ఓటీటీ ట్రెండింగ్‌లు మొదలయ్యాయి.
మా సినిమా ఇన్ని రోజులు టాప్ 10లో ఉంది, అన్ని దేశాల్లో చూస్తున్నారు అని లెక్కలేస్తున్నారు. ఈ క్రమంలో ఓ సినిమా ఏడాదికిపైగా టాప్ 10లో ఉంది. ఇది ఓ రకంగా రికార్డు అనే చెప్పాలి. ఆ ఘనతను అందుకున్న సినిమా ప్రభాస్ – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ‘సలార్’ (Salaar). యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘సలార్: సీజ్ ఫైర్’ 2023 చివరిలో ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ వసూళ్లు అందుకుంది.
ఈ సినిమాను గతేడాది ఫిబ్రవరి 16న ఓటీటీలోకి తీసుకొచ్చారు. మొదట నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ‘సలార్’ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత జియో హాట్‌స్టార్ వేదికగా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటివరకు ఓటీటీలో టాప్ 10లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాకు దక్కుతున్న ఆదరణకు ఇదొక నిదర్శనం అని చెప్పాలి. తాజాగా ఈ విషయమై ఆ సినిమాలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) స్పందించాడు.
ఇది తాను ఊహించలేదని, ఈ విజయం ఆనందంగా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సినిమా రెండో పార్ట్ ‘సలార్: శౌర్యాంగపర్వం’ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఆ సినిమా విజయం నేపథ్యంలో ప్రశాంత్ నీల్ టీమ్ మొదట అనుకున్న స్క్రిప్ట్‌కు మెరుగులుదిద్దే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే సినిమా ఆలస్యమవుతోంది. తారక్‌తో (Jr NTR) సినిమా పూర్తయిన తర్వాత ‘సలార్ 2’ స్టార్ట్ చేస్తారని సమాచారం.