జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు అంటుంటారు మన పెద్దలు. అంటే కావాల్సినవన్నీ అన్నీ సిద్ధంగా ఉండవు అని వారి అర్థం. కావాల్సిన ప్రతిదానిని మనమే కష్టపడి సంపాదించుకోవాలి. అప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఆ వ్యక్తి విలువ పెరుగుతుంది అని చెబుతుంటారు. కథానాయిక సమంత విషయంలోనూ ఇంతే. ఆమె పుట్టుకతోనే ధనవంతురాలు కాదు, అలా అని ఏ కష్టమూ పడకుండా ఇంత సంపాదించుకోలేదట. సినిమా హీరోయిన్ కాకముందు సమంత పడ్డ కష్టాలను ఆ మధ్య ఓ సందర్భంలో వివరించింది.
సమంత దక్షిణాది హీరోయిన్‌గానే కాదు… మొత్తం పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. అయితే పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా నటించి ఆ ఘనత సాధించలేదు. పాన్ ఇండియా సినిమాలో ఓ హాట్‌ఐటెమ్ సాంగ్‌లో నర్తించి పాన్ ఇండియా ఐటెమ్ హీరోయిన్‌గా మారిపోయింది. అదే ‘పుష్ప’. అందులో ‘ఉ అంటావా… ఊ ఊ అంటావా’ అంటూ సమంత ఊగితే… కుర్రాళ్లూ అల్లల్లాడిపోయారు. ఇప్పుడు ఆ ఊపు బాలీవుడ్ అవకాశాలేంటి, ఇంటర్నేషన్ సినిమా అవకాశాలూ తెచ్చిపెట్టింది అంటున్నారు. ఇటీవలే ఓ ఇంగ్లిష్ సినిమా కూడా ఓకే చేసింది.
ఇదంతా ఇప్పుడు… మరి ఒకప్పుడో అంటే అందరి అమ్మాయిల్లాగే చాలా కష్టపడింది సమంత. హీరోయిన్ గా అవకాశాలు రాకముందు పెద్ద పెద్ద ఫంక్షన్స్ కు హాజరు అయ్యే గెస్ట్‌లకు వెల్ కమ్ చెప్పే అమ్మాయిగా సమంత వెళ్ళేదట. అలా చేయడం వల్ల ఆమెకు రోజుకు 500 ఇచ్చేవారట. ఒకానొక సమయంలో డబ్బుల్లేక రోజులో ఒక్క పూట మాత్రమే భోజనం చేసేదట. అలా సుమారు రెండు నెలలు ఒక్క పూట మాత్రమే తిన్నట్లు సమంత ఓ సందర్భంలో చెప్పింది.
బాగా చదివి సమంత క్లాస్ టాపర్‌గా నిలవాలని ఆమె తల్లిదండ్రులు కోరుకునేవారట. అయితే అవసరమైన డబ్బులు లేక, డిగ్రీలో జాయిన్ కాలేదట. దీంతో చదువును మధ్యలోనే వదిలేసింది సమంత. కెరీర్ సంగతి చూసుకుందామని మోడలింగ్ వైపు వెళ్తుంటే… కొంతమంది ఆమెను తెగ విమర్శించారట. అందులో కుటుంబానికి చెందినవారూ ఉన్నారట. అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందడుగు వేశాను అని గుర్తు చేసుకుంది సమంత.