చేనేత వస్త్రాల వాడకాన్నిప్రోత్సహించేందుకు కృషి చేస్తానని టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత చెప్పారు. కొన్నిరోజుల క్రితం తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ పరిశ్రమలోని కష్టనష్టాలను తెలుసుకునేందుకు ఆమె ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పర్యటించారు. దుబ్బాక చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో నేస్తున్న వస్త్రాలను పరిశీలించి వాటి ప్రత్యేకతపై నేత కార్మికులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ “నాకు ఈ రంగంపై కొంత అవగాహన ఉంది. మార్కెటింగ్ విస్తరించేందుకు ప్రయత్నిస్తా. ఇందుకోసం డిజైనర్లు, సంస్థల సాయం కూడా తీసుకుంటాను. మరో రెండు నెలల్లో చేనేత కార్మికులకు సంబంధించి కార్యాచరణను ప్రకటిస్తాను” అని అన్నారు. దుబ్బాకలో నేస్తున్న టవల్స్, లినెన్ వస్త్రాలను పరిశీలించిన స్యామ్ నమూనాలను తన వెంట తీసుకెళ్లారు.