దేశం నలుమూలల జరిగే లైంగిక దాడులు ఒక ఎత్తు.. సినిమా రంగంలో జరిగే లైంగిక వేధింపులు మరో ఎత్తు. సమస్య ఏదైనా మహిళలు అభివృద్ధి చెందడానికి ఈ దాడులు అడ్డంకిగా మారుతున్నాయి. ఆడపిల్లలను బయటికి పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. చిత్ర పరిశ్రమలో ఈ వేధింపులను తగ్గించడానికి ‘metoo’ ఉద్యమాన్ని కొన్నిరోజుల క్రితం తారలు మొదలుపెట్టారు. బాలీవుడ్, టాలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. ఇటీవల నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ఆరోపణలు చేయడంతో క్యాస్టింగ్ కౌచ్ మరోమారు బ్రేకింగ్ న్యూస్ అయింది. ఇదే సందర్భంలో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కూడా చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఆమె ట్వీట్స్ సమంతని కదిలించాయి. దాంతో వేధింపులను ఎదుర్కొన్న ఆడవాళ్లకు తాను మద్దతుగా నిలుస్తానంటూ సమంత ముందుకొచ్చారు. “చాలా మంది మహిళలు ధైర్యం తెచ్చుకుని తాము ఎదుర్కొన్న సంఘటనల గురించి బయటపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. మీ ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఈ విషయంలో కొందరు వ్యక్తులు, మహిళలు మిమ్మల్ని నిలదీస్తూ, ప్రశ్నిస్తున్నందుకు సారీ. మీరు వేధింపుల గురించి మాట్లాడటం వల్ల చెప్పుకోలేని చిన్న పిల్లలను మీరు కాపాడినవారవుతారు. అందుకు ధన్యవాదాలు. ‘metooindiamovement’కు నేను మద్దతు తెలుపుతున్నాను’ అని సమంత ట్వీట్ చేశారు. సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ మద్దతు తెలపడం ఈ ఉద్యమానికి మరింత బలాన్నిచ్చింది.