నటీనటుల కెరీర్లో అన్ని మంచి పాత్రలే దొరకవు. కొన్ని బాధని కలిగించే పాత్రలు కూడా ఉంటాయి. అవి గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకు చేశామా? అని అనిపిస్తూ ఉంటోంది. టాలీవుడ్ క్యూట్ బ్యూటీ, అక్కినేని కోడలు సమంత కెరీర్ లోను అటువంటి పాత్రలు ఉన్నాయంటా. ఆ విషయాన్నీ స్వయంగా ఆమె వివరించింది. పవన్ కుమార్ దర్శకత్వంలో సమంత జర్నలిస్ట్ గా నటించిన “యూ టర్న్” మూవీ వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన సమంత మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పింది. “హీరోయిన్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా ఛాన్స్ వచ్చింది మొదటి సినిమాతోనే మంచి పేరు రావడంతో హీరోయిన్ గా కొనసాగాలని ఫిక్స్ అయ్యాను.
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నేను చేసిన పాత్రలు, నా నటన చూస్తే నాకే చీ అనిపిస్తుంది. మరీ ఇంత దారుణంగా నటించాను ఏంటీ? అని అనుకున్న సందర్బాలు చాలానే ఉన్నాయి. కెరీర్ ఆరంభంలో ఎలాంటి సినిమాలు ఎంపిక చేసుకోవాలో తెలియదు. ఎలాంటి కథలు సక్సెస్ అవుతాయి?, ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ఆధరణ పొందుతాయి?,ఎటువంటి పాత్రల్లో నటిస్తే ఎప్పటికి ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు.. అనే విషయాలు తెలియని కారణంగా వచ్చిన ప్రతి సినిమాకు సైన్ చేశాను. ఇప్పుడు ఆ సినిమాల గురించి తల్చుకుంటే ఆ సినిమాలను చేయకుంటే బాగుండేది” అని సమంత వెల్లడించింది. ఆ అనుభవంతోనే మంచి కథలను ఎంచుకుంటూ వరుసగా విజయాలను దక్కించుకుంటోంది.