టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత సినిమాలతోకాదు.. తన ప్రత్యేక పనులతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో జరిగిన నిశ్చితార్ధ వేడుకలో ఆమె కట్టుకున్న చీర స్పెషల్ గా నిలిచింది. చైతూతో ఆమె అనుబంధం మొత్తం చీరలో బొమ్మలుగా వేయించుకొని .. దాని గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. ఇప్పుడు మరో సారి ఆమె చీర వార్తల్లో నిలిచింది. బుధవారం హైదరాబాద్ లో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో అందరూ మోడరన్ దుస్తుల్లో మెరిసిపోతే సమంత మాత్రం చీరలో మాములుగా హాజరైంది. అప్పుడు అందంగా లేదు అని చెప్పిన వారంతా.. ఇప్పుడు ఆ సారీ వెనుక కథ తెలిసి ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. సమంత కట్టుకున్న చీర చేనేత కార్మికులు నేశారు.
సమంత చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఆ చీరను కట్టుకుంది. పైగా అందులో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఈ చీర డిజైన్ చేశారు. తెలంగాణ అధికార చిహ్నాలు అన్నిటినీ ఈ చీర లో పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్ర అధికార జంతువు జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట, అధికార పుష్పం తంగేడు పువ్వు, రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టు, ఇలా అన్నిటినీ చీరపై చూపించేలా డిజైన్ చేశారు. ఆ చీరతో సినీ వేడుకకు హాజరై చేనేత వస్త్రాలకు గట్టి ప్రచారం నిర్వహించి అందరితో సమంత శభాష్ అనిపించుకుంటోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.