‘ఏ మాయ చేసావే’ చిత్రం ద్వారా నాగ చైతన్య- సమంత లకు మధ్య పరిచయం ఏర్పడింది. ‘మనం’ టైంలో అది ప్రేమగా మారింది. అటు తర్వాత 3 ఏళ్లకు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. మరో మూడున్నరేళ్ల పాటు హ్యాపీగా బెస్ట్ కపుల్ గా జీవితాన్ని గడిపారు. అయితే ఏమైందో ఏమో గతేడాది ఆగస్టు టైంలో వీళ్ళు సెపరేట్ అయిపోయారు. అయితే ఈ విషయాన్ని అక్టోబర్ 2న ప్రకటించారు. ఈ విషయం తెలిసాక వీళ్ళ అభిమానులు బాగా హర్ట్ అయ్యారు.
సమంత అభిమానులు చైతన్యని అలాగే చైతన్య అభిమానులు సమంతని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక విడాకుల అనంతరం వాళ్ళు ఒకరి గురించి మరొకరు విమర్సించుకున్నది లేదు. అసలు వీళ్ళు ఎప్పుడూ కలవలేనట్టు హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. అయితే తాజాగా సమంత తన విడాకుల విషయం పై నేరుగా స్పందించింది. కరణ్ జోహార్ టాక్ షో కి హాజరైన సమంత విడాకుల విషయం పై స్పందించింది.
మీ భర్త గురించి ఏమైనా చెప్పండి అని అడుగగా.. మాజీ భర్త అంటూ సమంత గుర్తుచేసింది. అటు తర్వాత.. ‘విడాకుల తర్వాత ఎంతో మనోవేదనకు గురయ్యాను.. జీవితం కూడా కష్టమైపోయింది. అయినా ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నాను. స్ట్రాంగ్ గా నిలబడడం నేర్చుకున్నాను’ అంటూ సమంత జవాబిచ్చింది.
విడాకుల తర్వాత తన పై నెగిటివ్ కామెంట్స్ చేసే వారి సంఖ్య కూడా ఎక్కువైందని సమంత తెలిపింది. అలాగే తనకు భరణంగా రూ.250 కోట్లు అందినట్టు ప్రచారం జరిగిందని.. అది అంతా అబద్దమే అని మీడియా గ్రహించినట్టు ఆమె తెలిపింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం.