సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి గత కొన్ని రోజులుగా వాడీ వేడీ చర్చ సాగుతోంది. హాలీవుడ్లో మొదలైన “మీ టూ” బాలీవుడ్ మీదుగా టాలీవుడ్ కి వచ్చింది. ఇక్కడ లైంగిక వేధింపులకు గురైన వారు.. తమ బాధను దైర్యంగా బయటికి చెబుతుంటే.. వారికి స్టార్ హీరోయిన్స్ మద్దతు తెలుపుతున్నారు. గాయని చిన్మయి శ్రీపాద తనకి చిన్నప్పుడు జరిగిన సంఘటనలను బయటపెట్టింది. అందుకు సమంత మద్దతు తెలిపింది. దీనిపై కొంతమంది సమంతని అభినందించగా.. మరికొంతమంది విమర్శిస్తున్నారు. ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగినదాన్ని ఇప్పుడు బయటపెట్టాల్సిన అవసరం ఏమిటి? అని పలువురు నెటిజన్లు సమంతను డైరెక్టుగా అడిగేశారు. దీనికి సమంత స్పందిస్తూ.. “మా భయం కూడా అదే.. తప్పంతా మాదే అని మీరెక్కడ అంటారోనన్న భయంతోనే సమయం వచ్చినప్పుడు సమస్యలను బయటపెడుతున్నాం” అని సమాధానమిచ్చింది.
దీనిపై మరో నెటిజన్ గౌరవ్ ప్రధాన్ వ్యంగ్యంగా స్పందించారు. ‘‘ఈ రోజు మా అబ్బాయి నన్ను ఓ ప్రశ్న అడిగాడు. ‘డాడీ అసలు ఈ ‘మీ టూ’ అంటే ఏంటి?’ అని అడిగాడు. అప్పుడు నేను ‘మీటూ అంటే ఆడవారి రిటైర్మెంట్ బీమా పథకం’ అని చెప్పాను. అప్పుడు మా అబ్బాయి ‘అంటే ఏమిటీ?’ అని మళ్లీ ప్రశ్నించాడు. దీంతో ‘ఆడవాళ్లు అన్ని విషయాల్లో తలదూరుస్తారు. కెరీర్ ముగిశాక ఈ బీమాను వాడుకుంటారు. అప్పుడు వాళ్ల గురించి విలేకరులు వార్తలు రాస్తుంటారు’’ అని చెప్పా. ఇది విని మా అబ్బాయి ‘గాడ్ బ్లెస్ ఇండియా’ అని అన్నాడు’’ అంటూ ఎగతాళి చేసాడు. ఈ కామెంట్లపై ఆగ్రహించిన సమంత ఘాటుగా స్పందించింది. “అదే ప్రశ్న నీ కూతురు అడిగితే ఏం చెబుతావ్?” అని ప్రశ్నించింది. దీంతో సదరు నెటిజన్ ఏమి మాట్లాడ లేకపోయాడు. లైంగిక వేధింపులపై ఇప్పటికైనా నటీమణులు స్పందిస్తున్నారని.. సంతోషపడకుండా.. వారిని విమర్శించేవారిని చూస్తుంటే కోపం ఆగడంలేదని అగ్రతారలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.