తల్లి కావాలని ఏ మహిళకి ఉండదు. గర్భం ధరించిన మహిళలను.. ‘మహారాణులతో సమానంగా చూడాలి’ అని అంటుంటారు పెద్దలు. నిజంగా తల్లి కావడం అనేది గొప్ప భాగ్యం. ఈ మధ్య కాలంలో గర్భం దాల్చడం.. దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది కొంతమంది మహిళలకు. అది హార్మోన్స్ లోపమో లేక ఆహారలోపం వల్లనో అనేది ఎవ్వరికీ అర్ధం కాని ప్రశ్న. సరే మనం అసలు మేటర్ కి వచ్చేద్దాం. తల్లి కావాలని పరితపించే విషయంలో సినీ సెలబ్రిటీలు అతీతం కాదు.
ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే సామాన్యులకు ఇబ్బందేమో కానీ వీళ్లకు కాదు అని అంతా అనుకుంటారు.కానీ 4 వ సారి కూడా ఆధునిక పద్ధతిలో ప్రయత్నించినా తల్లి కాలేకపోగా సైడ్ ఎఫెక్ట్స్ కు గురైంది ఓ నటి. వివరాల్లోకి వెళితే… బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన సంభావన ఇన్‌వెట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్)ను ఆశ్రయించింది. కానీ ఈ ఆధునిక పద్ధతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతోంది ఈ నటి. ఇప్పుడు ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్‌తో సతమతమవుతున్నట్టు చెప్పి ఆమె అందరికీ షాకిచ్చింది.
ఆమె మాట్లాడుతూ.. “పిల్లలను కనాలని ఐవీఎఫ్ పద్ధతిని ఎంచుకున్నాం. కానీ దీనివల్ల కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాను. చల్లగా ఉండే ప్రదేశం లో ఎక్కువ సేపు ఉండలేకపోతున్నాను. ఒకవేళ ఉంటే కాళ్లు, చేతులు మొద్దుబారిపోతున్నాయి. అలాగే వాపు లేదా నొప్పి కూడా వస్తుంది. ఒక్కోసారి నాపై నాకే కోపం వస్తుంది. అసలు నాకు ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి. మంచి జరుగుతుంది అనుకునేలోపు ఏదో ఒక చెడు జరుగుతుంది.
నా వల్ల నా భర్త అవినాష్ కూడా బాధపడుతున్నాడు. ఈ సమస్యలతో నాకు నరకంగా ఉంటుంది. కొంతమంది నేను లావు అయ్యాను అంటూ ట్రోల్ చేస్తున్నారు. అవును, నేను నాలుగోసారి ఐవీఎఫ్ పద్ధతి ప్రయత్నించగా అది ఫెయిల్ అయ్యింది. అందుకే ఇలా బరువు పెరిగాను’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది సంభావన.